
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెగని వర్షాలు
చివురుటాకులా వణికిన శ్రీకాకుళం, విజయనగరం
ఈ రెండు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు
అంధకారంలో గ్రామాలు.. నీట మునిగిన పొలాలు
విశాఖ సహా పలుచోట్ల నేలకొరిగిన చెట్లు, స్తంభాలు
వేర్వేరుచోట్ల గోడకూలి వృద్ధ దంపతులు సహా ముగ్గురి దుర్మరణం
వరదలో కొట్టుకుపోయి ఒకరి మృతి, మరొకరు గల్లంతు
18 సెం.మీ. పైగా వర్షంతో చెరువుల్లా మారిన పలాస–కాశీబుగ్గ
చాలా మండలాల్లో 10 సెంటీమీటర్లకు మించి వర్షం
ఉధృతంగా ప్రవహించిన నాగావళి, వంశధార నదులు
మునిగిన లోతట్టు ప్రాంతాలు, స్తంభించిన జనజీవనం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికింది...! ఎడతెరిపి లేని భారీ వర్షంతో తడిసి ముద్దయింది...! మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది...! విజయనగరం విలవిల్లాడింది...! విశాఖపట్నంలోనూ తీవ్రత కనిపించింది..! ఏకధాటిగా కురిసిన వానకు నదులు, వాగులు పొంగి ప్రవహించాయి...! గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అనేకచోట్ల చెట్లు రోడ్లపై కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునగడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
కాగా, వేర్వేరు ఘటనల్లో గోడకూలి వృద్ధ దంపతులు సహా ముగ్గరు మృతిచెందారు. నది ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రికార్డు స్థాయిలో 18.03 సెంటీమీటర్ల వర్షం కురవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ పట్టణాలు చెరువుల్లా మారాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. – సాక్షి, అమరావతి
శ్రీకాకుళం జిల్లా అంతటా కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. మెలియపుట్టి మండలం చుట్టూ నీరు చేరింది. మందసలో 13.9, హరిపురం (13.7), నందిగం (13.4), కంచిలి మండలం ఎంఎస్ పల్లె (13.1), టెక్కలి మండలం రావివలస (10.1), సోంపేట మండలం కొర్లాం (9.6), మెలియపుట్టి (9.3), కోట»ొమ్మాళి (9), సంత»ొమ్మాళి (8.9), పార్వతీపురం మన్యం సీతంపేటలో (8), సిరిగం (7.9), రాస్తకుంటబాయి (7.4), నిమ్మాడ (6.8), గార (6.7) వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పాఠశాలలకు స్థానికంగా ఎక్కడికక్కడ సెలవు ప్రకటించారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.
పలు మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం, కవిటి, పొలాకి, బుర్జ, ఆమదాలవలస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, లావేరు, నరసన్నపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, విజయనగరం జిల్లా మెరకముడిదం, గరివిడి, పైడి భీమవరం, రాజాపురం, పార్వతీపురం మన్యం జిల్లా పచి్చపెంట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది.
విజయనగరం విలవిల
విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగాయి. పొలాలను వరద ముంచెత్తింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరటి, చెరకు, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఏసూరిగెడ్డ ఉధృతికి రావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వంద ఎకరాల వరి ముంపునకు గురైంది.
గొట్టా, భగీరథపురం, నీలాదేవిపురం, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు, పాతహిరమండలం, జిల్లోడిపేట, కల్లట, గులుమూరు గ్రామాల్లో వందల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. పొట్ట, వెన్ను దశలో ఉన్న సమయంలో వరదతో పంటంతా పోయింది. వీరఘట్టం మండలంలో 850 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.
వట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో కురుపాం–రావాడ గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుముఠాలో ఉన్న సుమారు 30 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

తీరం దాటిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఒడిశాలోని గోపాల్‌పూర్–పారదీప్ మధ్య తీరం దాటింది. శుక్రవారానికి అతి బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
ఈపీడీసీఎల్‌కు రూ.1.78 కోట్ల నష్టం
వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వెల్లడించారు. గాలుల కారణంగా ఆరు సర్కిళ్లలోని విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయని తెలిపారు. 33 మండలాలకు గాను 25
మండలాల్లో విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు.
వంశధార ఉధృతి
భీతిల్లిన పరివాహక గ్రామాల ప్రజలు
గొట్టాకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ
వర్షాల దెబ్బకు నాగావళి, వంశధార నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంశధార ఐదారేళ్లుగా చూడని స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో నదీ తీర గ్రామాల ప్రజలు భీతిల్లారు. శుక్రవారం సాయంత్రం నుంచి వంశధార శాంతించింది.
తోటపల్లి, మడ్డువలస, జంఝావతి, పెదంకలాం, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది.
ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజీలోకి నీటి మట్టం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ధాటికి నదీ తీర ప్రాంత ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. బాహుదా నది కూడా పొంగి ప్రవహించడంతో తీర గ్రామాలు, పొలాలు నీట మునిగాయి. మహేంద్రతనయకూ వరద ఉధృతి కొనసాగుతోంది.
నేలకొరిగిన చెట్లు
ఈదురుగాలులు విశాఖను వణికించాయి. దసరా రోజున భారీ గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. 80 ప్రాంతాల్లో 170 పైగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి.

అల్లూరి జిల్లాలో కూలిన బడులు
భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకుల షెడ్డు గురువారం సాయంత్రం పడిపోయింది.
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా ముూడు జిల్లాల్లో నలుగురు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
వృద్ధ దంపతులను బలిగొన్న గోడ
మరో రెండు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం
క్యాబేజీ పంటంతా పోవడంతో రైతు ఆత్యహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హంసరాలి పంచాయతీ చిన్నటూరులో గురువారం రాత్రి మట్టి గోడ కూలి పెళ్లలు మీద పడడంతో వృద్ధ దంపతులు సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) ప్రాణాలు కోల్పోయారు. హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా బయట ఉంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు వీరి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురంలో వర్షాలకు నానిన గోడ కూలడంతో అరవింద్ మృతి చెందాడు. ఇతడి సోదరుడు వినయ్‌ను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మొగిలిపాడు గ్రామానికి చెందిన సైని గోపాలరావు (47) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురువారం జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండగా... అవతల ఉన్న పొలాన్ని చూసేందుకు వెళ్లిన గోపాలరావు తిరిగి రాలేదు. పొలం దగ్గర ఉన్న ఖానాలో పడిపోయి చనిపోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జె.రంగరాయపురంలో వేగావతి నదిలో యోగేశ్వరరావు (22) గల్లంతయ్యాడు.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన కౌలు రైతు బి.రాంబాబు క్యాబేజీ పంట మొత్తం నీట మునగడంతో పురుగుమందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.