నీటితో కొట్టుకుపోతున్న మట్టి ఎంత? | Tons of soil in washed away by rains in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నీటితో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?

Sep 2 2025 4:46 AM | Updated on Sep 2 2025 4:47 AM

Tons of soil in washed away by rains in Andhra Pradesh

తెలంగాణలో భారీ వర్షాలకు మట్టి కొట్టుకుపోయిన వరి పొలం

పంట నష్టం, ఆస్తి నష్టం కన్నా మట్టి నష్టం చాలా పెద్దది

మనమెవరమూ పట్టించుకోని మహా విపత్తు ఇది

దేశవ్యాప్తంగా హెక్టారుకు ఏటా సగటున 

21 టన్నులు మట్టి కొట్టుకుపోతోంది

తెలంగాణలో 13 టన్నులు

ఏపీలో 15 టన్నులు

మనం తినే ఆహారంలో 95% మట్టిలోనే పండుతోంది. వ్యవసాయానికి, ఆహార భద్రతకు నేలపైన ఉండే 6 అంగుళాల మట్టే (టాప్‌ సాయిల్‌) మూలాధారం. మానవాళికి ఎంతో విలువైన ఈ వారసత్వ సంపద వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతోంది. మేటలు వేసిన ఇసుక ఆ మట్టిలోనిదే. పంట నష్టం, ఆస్తి నష్టం కన్నా మట్టి నష్టం చాలా పెద్దది. మనం ఎవరూ పట్టించుకోని విపత్తు ఇది.

ఇలా భూముల్లోనుంచి కొట్టుకెళ్లిన మట్టి, ఇసుకతో రిజర్వాయర్లు, చెరువులు పూడుకుపోతున్నాయి. పైమట్టిని కోల్పోతున్న సాగు భూములు నిస్సారమవుతున్నాయి. ఫలితంగా 1960లో కిలో రసాయనిక ఎరువు వేస్తే 16.5 కిలోల పంట వచ్చేది. ఇప్పుడు 3.5 కిలోలకు తగ్గిపోయింది. మన దేశంలో ప్రతి సంవత్సరం హెక్టారుకు సగటున 21 టన్నుల టాప్‌ సాయిల్‌ కొట్టుకుపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలకు కోల్పోతున్న మట్టి ఎంత? 
మట్టి కొట్టుకుపోకుండా ఏమైనా చెయ్యగలమా? ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవాలి? వ్యవసాయ పద్ధతుల్లో ఏం మార్పులు తేవాలి?  శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? చదవండి..  – సాక్షి సాగుబడి

మట్టి.. మనకు పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు, తేమతో కూడి ఉండే నేల పైపొర వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది. మట్టి కోతకు గురికావటం వల్ల భూమి ఉత్పాదకశక్తి, పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. భూమి పైపొరలో 6 సెం.మీ. లోతు మట్టిలోనే పంటలు పండించుకొని తిని మనం బతుకుతున్నాం. 95% ఆహారాన్ని ఇస్తున్నది ఈ మట్టే. రాళ్లు రప్పలు, ఆకులు అలముల కారణంగా మట్టి సహజసిద్ధంగా నిరంతరం ఏర్పడుతూనే ఉంటుంది. 6 సెం.మీ. మందాన మట్టి ఏర్పడటానికి 1,000 సంవత్సరాలు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. అయితే, అంతకన్నా అతివేగంగా కొట్టుకుపోతున్నది. ఎక్కువగా దున్నే భూములు, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ.

తెలుగు రాష్ట్రాల్లో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో ఏటా హెక్టారుకు సగటున 14–15 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. తెలంగాణలో సగటున హెక్టారుకు ఏడాదికి 14 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో సగటున 15 టన్నుల మట్టి వర్షానికి, వరదలకు కొట్టుకుపోతున్నదని ఐఐటీ ఢిల్లీ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వేల టన్నుల్లోనే మట్టి కోతకు గురై కొట్టుకుపోతోంది.

కొండ ప్రాంతాలు, వాలు ఎక్కువగా ఉన్న భూములు, అడవులు నరికివేసిన నేలలు, తవ్వకాలు జరిగే ప్రాంతాలు, ఎక్కువగా దుక్కి లేదా దమ్ము చేసే ఎటువంటి ఆచ్ఛాదనా లేని వ్యవసాయ భూముల్లో నుంచి నమ్మలేనంత ఎక్కువ మొత్తంలో హెక్టారుకు ఏడాదికి వేల టన్నుల్లోనే మట్టి కొట్టుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4,407 టన్నులైతే, తెలంగాణలో కొంచెం తక్కువగా 3,498 టన్నులు కొట్టుకుపోతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.

పెద్దపల్లిలో అత్యధికం
తెలంగాణ జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : పెద్దపల్లి– 22, నల్లగొండ– 20, కుమురంభీం ఆసిఫాబాద్‌– 18, ములుగు– 18, జయశంకర్‌ భూపాలపల్లి– 18, ఆదిలాబాద్‌ – 17, జగిత్యాల– 17, భద్రాద్రి కొత్తగూడెం– 17, మంచిర్యాల– 17, ఖమ్మం– 16, సూర్యాపేట– 16, వరంగల్‌ రూరల్‌– 16, మహబూబాబాద్‌– 13, కరీంనగర్‌ – 13, వరంగల్‌ అర్బన్‌– 13, యాదాద్రి భువనగిరి– 13, వనపర్తి– 12, జనగాం– 12, నిర్మల్‌– 12, నిజామాబాద్‌– 12, వికారాబాద్‌– 12, కామారెడ్డి– 11, రాజన్న సిరిసిల్ల– 11, మహబూబ్‌నగర్‌– 11, నాగర్‌ కర్నూల్‌– 11, సంగారెడ్డి– 10, నారాయణపేట– 10, సిద్ధిపేట– 9, మెదక్‌– 9, రంగారెడ్డి– 9, జోగుళాంబ గద్వాల– 8, మేడ్చల్‌–మల్కాజిగిరి– 6, హైదరాబాద్‌– 0. జనావాసాలతో కిక్కిరిసి ఉండే హైదరాబాద్‌ జిల్లా నుంచి వర్షానికి మట్టి పెద్దగా కొట్టుకుపోవట్లేదు! అత్యధికంగా మట్టి కొట్టుకుపోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఇస్రో అధ్యయనం తెలిపింది.

ఆరు వర్గీకరణలు
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం దాదాపు 300 చదరపు కిలోమీటర్లు లేదా దాని ఉపరితల నేలలో 31 శాతం ‘విపత్కర’ స్థాయిలో కోతకు గురవుతోంది. ‘దేశంలో నేల కోతపై సమగ్ర అవగాహన కలిగించేందుకు నేల కోత ఏయే జిల్లాల్లో ఏయే దశల్లో ఉందో అధ్యయనం చేశాం’ అన్నారు సహారియా. ఒక సంవత్సరంలో హెక్టారు భూమి నుంచి టన్నుల కొద్దీ మట్టి కొట్టుకుపోతోంది. ఒక సంవత్సరంలో ఒక హెక్టారులో 100 టన్నులకు పైగా మట్టి కోతకు గురైనట్లు తేలితే, ఆ ప్రాంతాన్ని ‘విపత్తు’ ప్రాంతంగా వర్గీకరిస్తారు.

జాతీయ సగటు హెక్టారుకు 21 టన్నులు
దేశంలో వానలు, వరదలకు సగటున సంవత్సరానికి హెక్టారు భూమి నుంచి 21 టన్నుల మేరకు మట్టి నీటితో పాటు కొట్టుకుపోతోందని ఢిల్లీ ఐఐటీ అధ్యయనంలో తేలింది. భౌగోళిక స్థితి, జీవవైవిధ్య పరంగా హిమాలయాలు, బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాలు నేల కోతకు అతిపెద్ద హాట్‌స్పాట్‌. అక్కడితో పోల్చితే భిన్నంగా ఉండే ఒడిశా లో కూడా ‘విపత్కర’ స్థితిలో నేల కోతకు గురవుతోంది.

జిల్లాల వారీగా చూస్తే, దేశంలో నేల కోతకు గురయ్యే అవకాశం ఉన్న 20 జిల్లాల్లో తొమ్మిది అస్సాంలోనే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.  అడవుల నరికివేత, రసాయనిక/పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చెయ్యటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ‘నేల కోతకు సంబంధించి పాన్‌–ఇండియా స్థాయిలో రాష్ట్రాలు, జిల్లాల వారీగా అధ్యయనం చేసి గణాంకాలను ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచాం. భవిష్యత్తులో నేల సంరక్షణ ప్రణాళికల అమలుకు ఈ సమగ్ర అవగాహన దోహదపడుతుందని ఆశిస్తున్నాం అన్నారు సహారియా.

వర్షపాతం ఇంకా పెరుగుతుంది!
వర్షపాతం వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2050 నాటికి ఖరీఫ్‌ కాలంలో 5–10 శాతం, రబీ కాలంలో 12–17 శాతం వర్షపాతం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గతంలో పార్లమెంటులో చెప్పారు. అంటే, నివారణ చర్యలకు మనం ఉపక్రమించకపోతే రానున్న రోజుల్లో మరింత మట్టి కొట్టుకుపోతుందన్నమాట. 2050 నాటికి హెక్టారుకు మరో 10 టన్నుల మట్టి కొట్టుకుపోతుందని కూడా మంత్రి హెచ్చరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ సమస్యను కొంత వరకు అధిగమించవచ్చు.

100 టన్నుల మట్టి పోతే విపత్తు!
మన దేశంలో భూముల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఢిల్లీలోని ఇండియన్‌ ఇ¯Œ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) అధ్యయనం వెల్లడించింది. దాదాపు 30 శాతం భూభాగం ‘స్వల్పంగా’ కోతకు గురవుతూ ఉంటే, కీలకమైన 3 శాతం భూభాగం ‘విపత్కర’ స్థితిలో మట్టిని వర్షాలు, వరదల వల్ల నష్టపోతోందని ఈ పరిశోధన తెలిపింది. జియోస్పేషియల్‌ మోడలింగ్‌ – మ్యాపింగ్‌’ పేరిట జరిగిన ఈ అధ్యయనం మన దేశం అంతటా నేల కోతను లెక్కగట్టింది. ఢిల్లీ ఐఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్,  హైడ్రోసెన్స్‌ ల్యాబ్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డా. మనబేంద్ర సహారియా, రవిరాజ్‌ అధ్యయనం చేశారు.

ఉత్తరాంధ్రలో అత్యధికం
ఏపీలోని పాత జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : శ్రీకాకుళం– 27, 
విశాఖపట్నం– 27, విజయనగరం– 25, తూర్పు గోదావరి– 16, చిత్తూరు– 16, అనంతపురం– 15, వైఎస్సార్‌ కడప – 14, పశ్చిమ గోదావరి– 13, కృష్ణా– 13, ప్రకాశం– 13 (782), గుంటూరు– 12, కర్నూలు– 12, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు– 10 .

భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?
హెక్టారు భూమిలో 1 సెం. మీ. వర్షం కురిస్తే లక్ష లీటర్ల నీరు పడుతుంది. అధిక వర్షాలకు పొలంలోని మెత్తని మట్టి నీట కరిగి వరదతో వెళ్లిపోతుంది. ఆ మట్టి నీటి అడుగుకు చేరాలంటే పది గంటలు పడుతుంది. కాబట్టి, రిజర్వాయర్లు, చెరువుల్లోకి వరద నీటి ద్వారా ఆ మట్టి చేరుతుంది. ఇసుకైతే దగ్గర్లోని పొలాల్లో మేట వేస్తుంది.  నేల పైపొర మట్టి వర్షానికి కొట్టుకుపోతే అడుగున మొరం, రాళ్లు, రప్పలు పైకి తేలతాయి. ఒక మోస్తరు వర్షపు నీరు పొలం నుంచి బయటకు పోకుండా భూమిలోకి ఇంకాలంటే పంట పొలాల్లో కందకాలు, కుంటలు తవ్వుకోవాలి. నీరు ఇంకటంతో పాటు మట్టి కూడా పొలం దాటి బయటకు పోకుండా కందకాలు లేదా కుంటల్లో ఆగుతుంది. మట్టిని తర్వాత తీసి మళ్లీ పొలంలో వేసుకోవచ్చు. మట్టిని పరిరక్షించుకునేందుకు అందరూ శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?
– డా. అల్లూరి పద్మరాజు, ఆంగ్రూ మాజీ వైస్‌ఛాన్సలర్‌

మట్టిని జాతి సంపదగా చూడాలి
ఏటా హెక్టారు భూమిలో 1.5 టన్నుల మట్టి కొత్తగా ఏర్పడుతుంది. 200 ఏళ్లకు గానీ ఒక అంగుళం ఎత్తు మట్టి ఏర్పడదు. అయితే, అంతకు 8 రెట్ల మట్టి ప్రతి ఏటా వాన నీటితో, గాలితో కొట్టుకు పోతోంది.  ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పొలం రైతు సొంతదైనా మట్టిని జాతి సంపదగా చూ­డా­లి. 

మట్టిని కాపాడుకోవటానికి, భూసారాన్ని పెంపొందించుకోవటానికి ప్రభుత్వం ఈ 4 ప­ను­లు చెయ్యాలి: 1. భూమిని వీలైనంత మేరకు ఆచ్ఛాదన పంటలతో, గడ్డితో కప్పి ఉంచటం. 2. అతిగా దున్నటం, దమ్ము చెయ్యటం తగ్గించటం. 3.సాగు పద్ధతి ఏదైనా భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా కలిసేలా పచ్చిరొట్ట పంటలు సాగు చేసి కలియదున్నాలి. 4. ప్రతి సీజన్‌లోనూ దున్నాల్సిన అవసరం ఉన్న వరి వంటి పంటలకు బదులు తోటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
– డా. జీవీ రామాంజనేయులు, ఈడీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవస్థాపకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement