బూత్‌ కమిటీలపై ఫోకస్‌

Major Partys are Preparing Booth Committees by Constituencies - Sakshi

ఓటర్ల సమీకరణలో కీలకం కానున్న కమిటీలు 

నియోజకవర్గాల వారీగా బూత్‌ కమిటీలనుసిద్ధం చేస్తున్న ప్రధాన పార్టీలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రచార గడువు ముగింపుకొస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు బూత్‌కమిటీలపై దృష్టి పెట్టాయి. పోలింగ్‌కు ముందు రెండ్రోజులు, పోలింగ్‌ రోజున వీరి పాత్ర క్రియాశీలకం కానున్న నేపథ్యంలో బూతు కమిటీలకు కావాల్సిన సరంజామా సర్దే పనిలో పడ్డాయి. పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్‌ కమిటీలతో పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీఎంలలో అభ్యర్థుల నంబరింగ్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డమ్మీ ఈవీఎంలతో వారికి అవగాహన కల్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్‌ కమిటీలను పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ఓటింగ్‌ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్‌లకు తీసుకొచ్చేందుకు పార్టీలన్నీ బూత్‌ కమిటీలపై ఆధారపడుతున్నాయి.  

ఇన్‌చార్జీలకు ప్రత్యేక శిక్షణ 
పోలింగ్‌ రోజు, అంతకు ముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్‌ కమిటీల ఇన్‌చార్జీలకు పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. పార్టీ ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కరపత్రాలు పంచడం, నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలన్నీ కమిటీలకే అప్పగించాయి. పార్టీల అసెంబ్లీ ఇన్‌చార్జీల సూచనల మేరకు బూత్‌కమిటీలను ఎంపిక చేసి, పార్టీకి ఓట్ల శాతం పెంచే యత్నాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్‌ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్‌ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top