
ఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) అనేది భారతదేశంలో ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించే ఒక పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరం. పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన ఈ వ్యవస్థపై రాజకీయ పార్టీల అభ్యంతరాల సంగతి తెలిసిందే. అయితే అవకతవకలకు ఎలాంటి తావు లేదంటూ ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంటూ వస్తోంది.
ఈ క్రమంలో.. బిహార్ ఎన్నికల నుంచి ఈసీ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాటు చేయనుంది. ఈవీఎంపై 20 ఎంఎం సైజులో అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు 40 ఎంఎం సైజులో పార్టీ సింబల్ ఉంచనున్నారు. బిహార్ ఎన్నికల నుంచి ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించనుంది.
కాగా, దేశవ్యాప్తంగా పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానే శ్రీకుమార్ ఇటీవల తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. "ఆయన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలి. లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమా పణ చెప్పాలి” అంటూ డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చేపట్టిన ఓటు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీఈసీ చెప్పారు.
దీనిపై కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయన్నారు. శాశ్వత స్థిరనివాసంలో ఒకటి, వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వల్ల మరోటి... ఇలా కొందరికి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉండొచ్చు. ఇలాంటి తప్పిదాలను సరిచేసేందుకు పోలింగ్ యంత్రాంగం కృషి చేస్తోందంటూ ఆయన చెప్పుకొచ్చారు.