2 గంటల్లో మినీ ఆస్పత్రి

Madras IIT Came With Medicab Technology Builds Mini Hospital In 2 Hours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసలే ఇది కరోనా కాలం.. చాలా ఆస్ప త్రుల్లో ఐసీయూ పడకల కొరత! కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, ఐసీయూ పడకల ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. ఈ చిక్కు సమస్యకు తెలివైన పరిష్కారాన్ని ఆవిష్కరించింది ఐఐటీ మద్రాస్‌ లోని స్టార్టప్‌ కంపెనీ మోడ్యులస్‌ హౌసింగ్‌. కొన్ని గంటల్లోనే మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. మెడిక్యాబ్‌ అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీ సాయంతో పది హేను పడకలతోపాటు ఒక ఐసీయూ, వైద్యుడి కోసం ప్రత్యేక గదిని నలుగురు వ్యక్తులు కలిసి రెండు గంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కరోనా రోగులను గుర్తించడం మొదలు, ఐసోలేషన్‌లో ఉంచే వరకు అన్ని ప్రక్రియలను ఒక్కచోటే నిర్వ హించవచ్చన్నమాట. దేశవ్యాప్తంగా మినీ ఆస్ప త్రుల ఏర్పాటుకు ఇది మేలైన మార్గమని అంటు న్నారు. మెడిక్యాబ్‌లో వైద్యుడి గది, ఐసోలేషన్‌ గది, చికిత్స అందించే వార్డు, రెండు పడకలున్న ఐసీయూలతో అచ్చం పెద్దాస్పత్రుల్లో మాదిరిగానే రుణాత్మక పీడనం ఉంటుంది.

కేరళలో నమూనా మెడిక్యాబ్‌!
కేరళలోని వైనాడ్‌ జిల్లాలో మెడిక్యాబ్‌ మినీ ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీ చిత్ర తిరుణాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సాయం అందించింది. 2018లో ఇద్దరు ఐఐటీ పట్టభద్రులు మోడ్యులస్‌ హౌసింగ్‌ కంపెనీని స్థాపించారు. ముందుగానే నిర్మించిన గోడలు, కిటికీల్లాంటి భాగాలతో గృహ నిర్మాణాన్ని చౌకగా మార్చడం అప్పట్లో ఈ కంపెనీ ఉద్దేశం. కానీ దీన్ని తాము కరోనా పరిస్థితులకు అనుగుణంగా మార్చి మెడిక్యాబ్‌ను సిద్ధం చేశామని కంపెనీ సీఈవో శ్రీరామ్‌ రవిచంద్రన్‌ తెలిపారు. కేరళలో ఏర్పాటైన నమూనా మినీ ఆసుపత్రి మెడిక్యాబ్‌ ప్రాముఖ్యత, అవసరాన్ని ప్రపంచానికి చాటేందుకు ఉపయోగపడుతుందన్నారు. ‘గంటల్లో ఏర్పాటు చేసుకోగల ఈ ఆసుపత్రిని ఐదు రెట్లు తక్కువ సైజుకు మడిచేసి ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చు.

ఒక లారీలో దాదాపు ఆరు మెడిక్యాబ్‌ల సామగ్రిని మోసుకెళ్లవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు మెడిక్యాబ్‌లు ఉపయోగపడతాయి. మినీ ఆసుపత్రులతోపాటు ఐసొలేషన్‌ వార్డులను కూడా మేం సిద్ధం చేశాం. చెన్నైలోని చెంగల్‌పేట్‌లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి వెయ్యిమందికి ఒకటి కంటే తక్కువ ఆసుపత్రి పడక అందుబాటులో ఉంది. మెడిక్యాబ్‌ వంటి సృజనాత్మక ఆలోచనలతోనే ఈ కొరతను అధిగమించడం సాధ్యమని అంచనా’ అని ఆయన వివరించారు. కరోనాపై పోరుకు ఐఐటీ మద్రాస్‌ తనదైన తోడ్పాటు అందిస్తోందని, ఎన్‌95 మాస్కుల తయారీ మొదలుకొని, చౌకైన వెంటిలేటర్ల తయారీ వరకు అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిందని ఐఐటీ మద్రాస్‌ ఇన్‌క్యుబేషన్‌ సెల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ తమస్వతి ఘోష్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top