సీబీఐ ప్రిన్సిపల్‌ జడ్జిగా మధుసూదన్‌రావు 

Madhusudan Rao as the Principal Judge of the CBI - Sakshi

ఏసీబీ ప్రిన్సిపల్‌ జడ్జిగా ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి

ఎన్‌ఐఏ కోర్టు జడ్జిగా డాక్టర్‌ టి.శ్రీనివాసరావు

న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేసిన హైకోర్టు

25 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు పదోన్నతులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీలను భర్తీ చేసేందుకు బుధవారం సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఏయే న్యాయాధికారులకు ఎక్కడెక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలన్న దానిపై కమిటీ తుది నిర్ణయం తీసుకున్న అరగంటలోపే ఆ వివరాలను హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. బదిలీలు, పోస్టింగులపై ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం.. వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. ఏడుగురు జిల్లా జడ్జీలను వేర్వేరు స్థానాలకు బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇవ్వగా, 25 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి కల్పించి ఆ మేర పోస్టింగ్‌లు ఇచ్చారు.

కమ్యూనల్‌ అఫెన్సెస్‌ అదనపు సెషన్స్‌ జడ్జి కమ్‌ 7వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, హైదరాబాద్‌ కమ్‌ 21వ అదనపు చీఫ్‌ జడ్జి, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్న బీఆర్‌ మధుసూదన్‌రావు హైదరాబాద్, సీబీఐ ప్రిన్సిపల్‌ జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవర్గాల్లో ఈయనకు చాలా సౌమ్యుడిగా పేరుంది. సికింద్రాబాద్‌ జుడీషియల్‌ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న జీవీ సుబ్రహ్మణ్యం మహబూబ్‌నగర్‌ ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న సీహెచ్‌కే భూపతిని జుడీషియల్‌ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా నియమించింది. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు రెండవ అదనపు చీఫ్‌ జడ్జి బి.పాపిరెడ్డిని సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా నియమించింది. సీబీఐ కోర్టు మూడవ అదనపు స్పెషల్‌ జడ్జిగా ఉన్న డాక్టర్‌ టి.శ్రీనివాసరావును హైదరాబాద్‌ 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కమ్‌ సిటీ సివిల్‌ కోర్టు హైదరాబాద్‌ 18వ అదనపు చీఫ్‌ జడ్జిగా నియమించింది.

ఈ కోర్టు ఎన్‌ఐఏ హోదా కలిగి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద దాఖలయ్యే కేసులను విచారిస్తున్న ఎస్‌.నాగార్జున హైదరాబాద్, లేబర్‌కోర్టు–1 ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. తెలంగాణ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌.గోవర్ధన్‌రెడ్డిని ఏసీబీ ప్రిన్సిపల్‌ జడ్జిగా నియమించింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి వీరంతా ఈ నెల 18లోపు రిలీవ్‌ అయి, 25లోపు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వరరెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 25 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన ఈ 25 మందికి పలు చోట్ల పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరు కూడా ఈ నెల 25లోపు కొత్త బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top