
హైకోర్టు జడ్జీలపై సుప్రీం అసహనం
వాళ్లకు మేం స్కూల్ ప్రిన్సిపాల్‌గా బోధించాలనుకోవట్లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: కొందరు హైకోర్టు న్యాయమూర్తులు వేగంగా కేసులను పరిష్కరించే వృత్తినైపుణ్యం ఉన్నా కూడా ఆ స్థాయిలో పనిచేయట్లేరని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తంచేసింది. అలాంటి జడ్జీలపాలిట స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి హితబోధ చెప్పే ఉద్దేశం తమకు లేదని, స్వీయసమీక్ష ద్వారా ఆ జడ్జీల తమ వైఖరిని మార్చుకోవాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం హితవు పలికింది.
‘‘హైకోర్టుల్లో రెండు రకాల జడ్జీలున్నారు. కొందరు జడ్జీలు పగలూరాత్రీ పనిచేస్తూ వేగంగా ఎక్కువ కేసులను పరిష్కరిస్తున్నారు. కొందరు జడ్జీలు మాత్రం దురదృష్టవశాత్తు సవ్యంగా సేవలు అందించట్లేదరు. కారణాలు మంచివైనా చెడ్డవైనా సరే పని మాత్రం సరిగా సాగట్లేదు. పరిస్థితులు ఎలాంటివనేది ఇక్కడ అప్రస్తుతం. ఒక జడ్జీ ఒక క్రిమినల్ కేసును ఆలకిస్తున్నారనుకుందాం. ఆయన రోజుకు 50 కేసులను పరిష్కరించాలని మేం అత్యాశపడట్లేదు. అలాగని ఆయన ఒక్క కేసు విచారించి గొప్ప పని చేశాననుకుంటే పద్ధతి కాదు.
బెయిల్ కేసులో రోజుకు ఒకే ఒక్క కేసును విచారిస్తూ కూర్చుంటా అంటే అది ఆయన ఆత్మపరిశీలనకే వదిలేయాలి. తమ వద్ద కేసుల పెండింగ్‌ల కొండ పేరుకుపోకుండా జడ్జీలు చూసుకోవాలి. ఆ మేరకు స్వీయ నియంత్రణ ఉండాలి. వృత్తిపరంగా నాణ్యమైన కార్యశీలత అనేది తప్పనిసరి. రోజుకు పరిష్కరించే ఎక్కువ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దాంతోపాటే కేసుల పరిష్కార విధానంలో అత్యున్నత న్యాయప్రమాణాలు, నియమనిబంధనలను పాటించాల్సిందే.
ఈ విషయంలో హైకోర్టు జడ్జీలకు స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరి పాఠాలు చెప్పే యోచన మాకు లేదు. మన ముందు ఎంతటి పెండింగ్ కేసుల భారం ఉంది, ఎంత త్వరగా ఆ భారాన్ని తగ్గించుకోవాలని అనే స్పృహ జడ్జీలకు ఉండాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమపై నమోదైన క్రిమినల్ కేసుల్లో వాదోపవాదనలు ముగిసి తీర్పులు జార్ఖండ్ హైకోర్టులో ఏళ్ల తరబడి రిజర్వ్‌లోనే ఉండిపోవడంతో విసిగిపోయిన ఆ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉదంతంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది.