లోకోపైలట్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

Loco Pilot Chandrashekar Health Condition Is In Critical Situation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాచిగూడ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ (35) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నాంపల్లి కేర్‌ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. ఎంఎంటీఎస్‌ కేబిన్‌లో ఇరుక్కొనిపోవడం వల్ల తీవ్రంగా గాయపడినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుష్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. కిడ్నీ దెబ్బతినడంతో డయాలసిస్‌ చేస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు రక్తప్రసరణ తగ్గిందని, ఇప్పటికిప్పుడు సర్జరీ చేసే పరిస్థితి లేనందున ప్రధాన విభాగాలకు చెందిన వైద్య నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

చంద్రశేఖర్‌ శరీరమంతా గాయాలతో నిండి ఉందని, పక్కటెముకలు విరిగాయని చెప్పారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఒకసారి కార్డియాక్‌ అరెస్ట్‌ అయినట్లు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప పరిస్థితి చెప్పలేమన్నారు. మరోవైపు రైలుప్రమాదంలో గాయపడి నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో మరో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. బేబి సుష్మిత సహా సాజిద్‌ అబ్దుర్‌ రషీద్‌ షేక్, పి. శేఖర్, రాజ్‌కుమార్, పి.బాలేశ్వరమ్మ, మహ్మద్‌ ఇబ్రహీంకు వైద్యసేవలను అందజేస్తున్నట్లు తెలిపారు.

ఎనిమిదేళ్ల క్రితం రైల్వేలో చేరిన చంద్రశేఖర్‌... 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్‌ ఎల్‌.చంద్రశేఖర్‌ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ మెకానిక్‌ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య సలై, కుమారుడు ఇమ్మాన్యుయెల్‌ రాజ్‌ (3) ఉన్నారు. 15 రోజుల క్రితం మరో బాబు పుట్టాడు. భార్య, పిల్లలు ఏలూరులో  ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top