వివాహ నమోదు ఇలా.. | Like a Marriage registration | Sakshi
Sakshi News home page

వివాహ నమోదు ఇలా..

Jul 11 2014 12:34 AM | Updated on Sep 2 2017 10:06 AM

వివాహ నమోదు ఇలా..

వివాహ నమోదు ఇలా..

మీ వివాహం చట్టబద్ధమైందని నిరూపించడానికి వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. న్యాయపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్ ఒక సాక్ష్యంగా పనిచేస్తుంది.

ప్రయోజనం..
ఆదిలాబాద్: మీ వివాహం చట్టబద్ధమైందని నిరూపించడానికి వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. న్యాయపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్ ఒక సాక్ష్యంగా పనిచేస్తుంది. హిందూ వివాహ చట్టం కింద వివాహ నమోదు జరుగుతుంది. వీసా, పాస్‌పోర్ట్, ఇంటి పేరు మార్పు వంటి ప్రయోజనాలను పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.  
                                              -
హిందూ వివాహ రిజిస్ట్రేషన్..
* దంపతులిద్దరీ పుట్టిన తేదీ తెలిపే సర్టిఫికెట్ (జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితా) అవసరం. ఇవేవీ అందుబాటులో లేకుంటే స్థానిక తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. అయితే స్వస్థలం నుంచే మాత్రమే ఈ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి.
 
ఉదా: భార్యాభర్తలలో ఒకరిది ఆదిలాబాద్, మరొకరిది జైనథ్‌మండల పరిధిలో ఉంటే వారు ఎవరి మండలంలో వారు బర్త్ సర్టిఫికెట్ పొందాలి.
* ఇద్దరి అడ్రస్ ప్రూఫ్ (ఆధార్, కరెంటు బిల్లు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వీటిల్లో ఏదైనా ఒక్కటి)ను సమర్పించాలి. దంపతులిద్దరిలో ఒకరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో నివాసితులై ఉండాలి.
* ముగ్గురు సాక్షులుగా సబ్‌రిజిస్ట్రార్ ముందు హాజరై సంతకాలు చేయాల్సి ఉంటుంది. సాక్షిగా వచ్చిన ముగ్గురి ఐడీ ప్రూఫ్ తప్పనిసరి.
* పెళ్లిపత్రిక, వివాహ ఫొటోలలో తాళికట్టే ఫొటో కాని, జీలకర్ర బెల్లం పెడుతున్న ఫొటో కాని ఇవ్వాలి. ఈ ఫొటోలలో ఇరువురి ముఖాలు స్పష్టంగా కనపడాలి.
* వివాహ నమోదుకు నిర్ణయించిన నిర్ణీత రుసుంను చెల్లించి, దరఖాస్తుతో పాటు పైన పేర్కొన్న ధ్రువపత్రాల నకలు, పెళ్లి ఫొటోలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తు ఫారాన్ని ఆన్‌లైన్‌లో, కార్యాలయంలో ఉచితంగా పొందవచ్చు.
* అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను సంబంధిత అధికారి పరిశీలించాక, సబ్ రిజిస్ట్రార్ ముందు సంతకాలు చేస్తే సరిపోతుంది.
  తర్వాత పని దినం రోజున మ్యారేజ్ సర్టిఫికెట్ పొందవచ్చు.
 
ఇతర వివాహ నమోదు..  
* ప్రేమ వివాహాలకు తప్ప మిగిలిన వాటికి పైన పేర్కొన్న విధి విధానాలు పాటించాలి. కాని ప్రేమ వివాహాలకు మాత్రం వివాహ నమోదు వేరుగా ఉంటుంది.
* ప్రేమ వివాహాన్ని నమోదు చేసుకోవాలంటే సంబంధిత కార్యాలయంలో మూడు దరఖాస్తులను సమర్పించాలి. ఒక దరఖాస్తు అధికారుల వద్ద, మరో దరఖాస్తు అదే కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచుతారు. మూడో దరఖాస్తును రెండో వ్యక్తి సొంత ఊరికి సంబంధించిన రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారు.
* నెల రోజుల గడువు అనంతరం ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే సాక్షి సంతకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు పరిశీలించి వివాహాన్ని రిజిస్ట్రర్ చేస్తారు.
* ఒక వేళ ప్రేమికులు ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంటే ఆర్యసమాజ్ జారీ చేసిన సర్టిఫికెట్‌తో 24 గంటలలోపు ఆర్యసమాజ్ ప్రాంతంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదిస్తే వివాహ నమోదు చేస్తారు.
 
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
* వివాహ నమోదు కోసం అమ్మాయి వయసు 18 ఉండాలి.  అబ్బాయి వయసు 21 సంవత్సరాలుగా నిర్ణయించారు.  
 
* పెళ్లి అయిన మూడు నెలలలోపు వివాహ నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.210 చెల్లించాలి. అలా చేసుకోకుంటే ప్రతి ఏడాదికి నిర్ణీత రుసుంతోపాటు అదనంగా రూ.5 వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement