
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో ఆయన గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ సమ్మెపై తమ వాదన పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని లక్ష్మణ్ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనే.. తదితర 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమ్మె గురువారానికి ఆరో రోజుకు చేరుకుంది.
లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మరో ఉద్యమం తప్పేలా లేదని, కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ నాణ్యమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంతేగాక 50 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగించామని పేర్కొనడం బాధాకరమని అన్నారు. ప్రజల బాధలు కేసీఆర్‌కు పట్టడం లేదని, తెలంగాణ ఆస్తులను తన ఆస్తులుగా కూడబెట్టే ప్రయత్నంలో కేసీఆర్ నిమగ్నమై పోయారని లక్ష్మణ్ విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న డిమాండ్లు కొత్తవేం కాదని,తెలంగాణ రాకముందు కేసీఆర్ కూడా ఈ డిమాండ్లు చేశారని లక్ష్మణ్ గుర్తు చేశారు. పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని కేసీఆర్ అప్పట్లో అన్నారని పునరుద్ఘాటించారు. మానవత్వం లేకుండా ఆర్టీసీ హాస్పిటల్లో సేవలను ఆపేశారని మండిపడ్డారు. ప్రజలందరిని ఏకం చేసి కేసీఆర్‌ను గద్దె దించుతామని, ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత గవర్నర్‌పై ఉందని లక్ష్మణ్ తెలిపారు.