‘అక్షయ విద్యా ఫౌండేషన్ ధారాదత్తం చేసిన తాడ్‌బండ్ సమీపంలోని స్థలం
లీజు రుసుం మాఫీ..గడువు పెంపుపై స్పష్టత ఇవ్వని కంటోన్మెంట్ బోర్డు
ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా విలువైన భూముల ధారాదత్తం
చర్చనీయాంశంగా మారిన బోర్డు అధికారుల వ్యవహారం
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలోని దాదాపు 1,200 గజాల స్థలం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ లీజులో ఉంది. కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ స్థలంలో ఓల్డ్ ఏజ్ హోం నిర్మించి తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రెడ్‌క్రాస్ సొసైటీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలతో కంటోన్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. 2021లో లీజు గడువు ముగియడంతోపాటు ప్రస్తుత స్టాండర్డ్ టేబుల్ రెంట్ (ఎస్‌టీఆర్) ప్రకారం వార్షిక లీజు రూ.6,19,525కు చేరింది.
అయితే తమ సంస్థ సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని లీజు రుసుములో మినహాయింపుతోపాటు, గడువు పెంచాల్సిందిగా ఏకంగా గవర్నర్ కార్యాలయం నుంచి ఓ అభ్యర్థన వచి్చంది. దీనిపై నాలుగేళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలే తప్ప, బోర్డు నుంచి సానుకూల నిర్ణయం వెలువడలేదు. తాజాగా శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల విలువైన కంటోన్మెంట్ స్థలాలను చిన్నపాటి స్వచ్ఛంద సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం గమనార్హం.
ఏకంగా గవర్నర్ చైర్మన్‌గా వ్యవహరించే స్వచ్ఛంద సంస్థ ప్రతిపాదనలను తోసిపుచ్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెడ్‌క్రాస్‌కు అప్పగించిన స్థలానికి లీజు రూపంలో ఏడాదికి రూ.6 లక్షలకు పైగా చెల్లించాలని కోరుతున్న బోర్డు అధికారులు, ఇటీవల రెండు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించిన సుమారు రెండెకరాల స్థలం నుంచి ఎలాంటి రుసుం పొందడం లేదు.
అక్షయ విద్యా ఫౌండేషన్‌కు అప్పగించారు
తాడ్‌బండ్ చౌరస్తా సమీపంలో బోర్డుకు ఎకరం స్థలం ఉంది. రాష్ట్ర విద్యాశాఖకు అప్పగించడంతో ఇక్కడ ఓ స్కూలు నిర్మించారు. అయితే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం ఈ స్కూల్‌ను మూసేశారు. విద్యాశాఖ ఆ స్థలాన్ని తిరిగి కంటోన్మెంట్ బోర్డుకు అప్పగించింది. గతేడాది ఈ స్థలంతోపాటు అందులోని భవనాలను ‘అక్షయ విద్యా ఫౌండేషన్’కు 20 ఏళ్ల పాటు అప్పగించేశారు.
బస్తీల్లో పేద విద్యార్థులు, స్కూలు విద్యార్థుల కోసం ఈ సంస్థ ఓ ప్రయోగశాలను నిర్వహిస్తామన్న ప్రతిపాదనలకు బోర్డు అధికారులు అంగీకారం తెలిపారు. పైగా సదరు సంస్థకు విద్యుత్, తాగునీరు, సెక్యూరిటీని సైతం బోర్డు ఆధ్వర్యంలోనే అందజేస్తామని చెప్పారు.
డంపింగ్ యార్డు స్థలం గోశాలకు
కంటోన్మెంట్‌లోని చెత్త డంపింగ్ కోసం తుర్కపల్లి సమీపంలో 1930లోనే 16 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలం మధ్య నుంచి రోడ్డు వేయడంతో రెండెకరాల స్థలం కోల్పోవాల్సి వచి్చంది. మిగిలిన 14 ఎకరాల్లో రోడ్డుకు ఓ వైపు ఎకరం, మరో వైపు 13 ఎకరాలు మిగిలింది. రోడ్డుకు అవతలి వైపున ఉన్న ఎకరం స్థలం కబ్జాకు గురైంది. చుట్టూ కాలనీలు వెలియడంతో 13 ఎకరాల్లో చెత్త డంపింగ్ వేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ యాంటీ రేబీస్ సెంటర్‌ను కొనసాగిస్తూ వచ్చారు.
ఇటీవల అది కూడా మూత పడింది. ఈ క్రమంలో గౌతమ్ ముని చారిటబుల్ సంస్థ గోశాల ఏర్పాటుకు స్థలం కావాలని కోరడంతో, నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డులో ఎకరం స్థలాన్ని కేటాయించారు. గోశాల కోసం తీసుకున్న స్థలంలో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఈ స్థలం నుంచి కూడా కంటోన్మెంట్‌కు ఎలాంటి ఆదాయం సమకూరదు. అయినా, రూ.20 కోట్ల విలువైన స్థలాలను ఇలా ధారదత్తం చేయడంలో బోర్డు అధికారుల ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.


