
నల్లగొండ: రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న రైతులు పెట్టుబడి రాయితీ వదులుకుంటే ఆ నగదు మొత్తాన్ని రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేస్తామన్నారు. తిరిగి రైతుల సంక్షేమానికే ఆ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు.
ఓ రైతుగా స్వచ్ఛందంగా పెట్టుబడి రాయితీని వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. అప్పుల బాధతో రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దని, అప్పులు తీర్చాలని ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తే రైతులు సమన్వయ సమితుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ వరకు రైతులు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చెప్పారు. రైతు సమస్యలకు సమన్వయ సమితులు పరిష్కార వేదికగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. సమన్వయ సమితుల లక్ష్యాలను సీఎం కేసీఆర్ కో ఆర్డినేటర్లకు వివరిస్తారని చెప్పారు.
రాష్ట్ర కార్పొరేషన్ బోర్డు తొలి సమావేశాన్ని ఈ నెల 22న నిర్వహిస్తామని గుత్తా తెలిపారు. ఈ సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు.