భూ పంపిణేది.?

Land Distribution Scheme Not Implemented Adilabad - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: భూమిలేని దళిత కుటుంబాలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి పంపిణీ చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందించేలా ప్రభుత్వం 2014 ఆగస్టులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బస్తీ పథకం పేదలకు భరోసా ఇవ్వలేకపోతోంది. దళిత మహిళల పేరిట ఏటా భూ పంపిణీ చేసి వ్యవసాయానికి అనువైన భూములు కొనివ్వాలనేది పథకం ఉద్దేశం. మూడెకరాల భూమితోపాటు ఇచ్చిన మొదటి యేడాది పెట్టుబడి ఖర్చులు సైతం ప్రభుత్వం అందజేస్తోంది. పథకం అమలు ఇంతవరకు బాగానే ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అర్హులకు లబ్ధి చేకూరడం లేదు.

జిల్లాలో 18 మండలాలు ఉండగా, ఇంకా మూడు మండలాల్లో ఈ పథకం ప్రారంభమే కాలేదు. వ్యవసాయానికి అనువైన ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకానికి నిధులు రాకపోవడంతో పథకం అమలుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భూములు అమ్మేందుకు యాజమానులు ముందుకు వస్తున్నా.. నిధులు లేక అధికారులు ముందడుగు వేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో 1101 మంది లబ్ధిదారులకు 2,924 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.

జిల్లాలో ప్రగతి ఇలా.. 
జిల్లాలో 18 మండలాల్లో పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. 15 మండలాల్లో భూ పంపిణీ జరిగింది. ఆదిలాబాద్‌ అర్బన్, మావల, సిరికొండ మండలాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. మైదాన ప్రాంతాలతోపాటు ఏజెన్సీ గ్రామాలున్నాయి. జిల్లాలో ఈ నాలుగేళ్లలో 1101 మంది లబ్ధిదారులకు 2,924 ఎకరాల వ్యవసాయ భూములు కొని పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 1,670 ఎకరాలు పంపిణీ చేయగా, 642 మంది మహిళలకు లబ్ధి చేకూర్చారు. ఇందుకు రూ.70.12 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక బోథ్‌ నియోజకవర్గంలో 1,254 ఎకరాలు కొనుగోలు చేసి 459 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇందుకు రూ.51.39 కోట్లు ఖర్చు చేశారు. అత్యధికంగా జైనథ్‌ మండలంలో 1302 ఎకరాలు కొని 515 మంది మహిళలకు అందజేయగా, అతి తక్కువగా నేరడిగొండ మండలంలో 8.36 ఎకరాలు కొనుగోలు చేసి ముగ్గురికి పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
అందుబాటులో 650 ఎకరాలు.. 
మూడెకరాల భూమి కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు రాకనే కొనుగోలుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. దీంతో వ్యవసాయానికి అనువైన భూములు కొనుగోలు చేసేందుకు ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్పా భూమి కొనుగోలు చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనికి తోడు జిల్లాలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో పథకం అమలు మరింత వెనుకబడుతోంది. మంచి భూములను అమ్మేందుకు పట్టాదారులు ముందుకు వచ్చినా నిధులు లేక వెనుకడుగు వేయక తప్పడం లేదు. నియోజకవర్గంలో ఆర్డీవో, కింది స్థాయి అధికారులు దళిత బస్తీ కింద వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు గడిచిన వేసవిలో భూములు పరిశీలించారు.

వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను గుర్తించి సిద్ధంగా ఉంచారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 650 ఎకరాలు భూమి అందుబాటులో ఉందని, పరిశీలన చేసి కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భూముల కొనుగోలుకు సరైన సమయమిదేనని, వర్షకాలం కావడంతో ఏ రకం భూముల్లో ఎంత మేరకు పంటలు ఉన్నాయో, దిగుబడి సాధించవచ్చవచ్చో.. లేదో.. తెలుసుకునే అవకాశం ఉందని విక్రయదారులు, లబ్ధిదారులు కోరుతున్నారు. ఫలితంగా భూములు సాగుకు యోగ్యమైనవా.. కావా..? అని గుర్తించవచ్చని చెబుతున్నారు. డిసెంబర్‌ వరకు రైతులు వేసుకున్న పంటలు ఉంటాయని, పంపిణీకి అవకాశం లేకున్నా భూములను పరిశీలించేందుకు అనువైన సమయమని పేర్కొంటున్నారు.

లబ్ధిదారుల ఎదురుచూపులు.. 
భూముల పంపిణీ కోసం అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూçస్తున్నారు. ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో భూములు పంపిణీ చేస్తామని చెబుతున్నా అధికారులు ఇంకా ఏ ఒక్క మండలంలో పూర్తిగా అన్ని గ్రామాల్లో భూములు పంపిణీ చేసిన దాఖాలాలు లేవు. పథకాల ప్రక్రియ అమలులో భాగంగా గ్రామాలకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సైతం భూ పంపిణీని వేగవంతం చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తామని చెబుతున్నారే తప్పా ఆచరణలోకి తేవడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్‌కు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top