కేయూ క్యాంపస్‌: ‘సేవ’కు సెలవు..

KU Not Celebrating The 2018 NSS Celebrations In Warangal - Sakshi

సాక్షి, కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఏటా నిర్వహించే జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమాలు నిధుల లేమితో నిలిచిపోయాయి. ఈ విద్యాసంవత్సరం కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించలేదు. ప్రతి ఏటా కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగానికి సుమారు రూ.ఒక కోటి 60 లక్షల వరకు విడుదలవుతుం టాయి. ఆ నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కేయూ పరిధిలో 363 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు..
నాట్‌ మీ బట్‌ యూ(నా కోసం కాదు నీ కోసం) అనే నినాదంతో జాతీయ సేవా పథకం ద్వారా కళాశాల స్థాయిలో విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో వారిలో వ్యక్తిత్వ వికాసం కూడా పెంపొందుతుంది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ ,పీజీ కళాశాలల్లో మొత్తంగా 363 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 100 మంది చొప్పున యూనివర్సిటీ పరి«ధిలో 36,300 మంది వలంటీర్లు ఉన్నారు. ఆయా కళాశాలల్లో ఎయిడ్స్‌ డే, పర్యావరణ దినోత్సవం తదితర ముఖ్యమైన రోజుల్లో  ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేగాక క్లీన్‌ అండ్‌ గ్రీన్, స్వచ్ఛ భారత్, హరితహారం కింద మొక్కలను నాటడంలాంటివి కూడా చేస్తుంటారు. ఇలా రోటీన్‌ కార్యక్రమాల నిర్వహణకుగాను ప్రతి ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌కు రూ.22 వేలు విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు తమ కళాశాల పరిధిలో ఎంపిక చేసిన గ్రామంలో ఏడు రోజులపాటు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తుంటారు. నిధుల లేమితో ఈ ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఈ విద్యాసంవత్సరంలో డిసెంబర్‌ మొదటి వారం దాటినా ఇంకా నిధులు విడుదల చేయలేదు.

నిధుల విడుదల తర్వాతే అడ్వయిజరీ కమిటీ భేటీ.. 
ఈ విద్యాసంవత్సరంలో కేయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇందులో గత విద్యాసంవత్సరంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలను సమీక్షించటంతోపాటు ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి నిర్ణయిస్తారు. ఆ తర్వాత  ఉమ్మడి జిల్లా స్థాయిలో  ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం నిర్వహించి ఆయా జిల్లాల పరిధిలో ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. ఇందులోనే రోటీన్‌ కార్యక్రమాల కోసం రూ.22 వేల చొప్పున ప్రతి ప్రోగ్రాం ఆఫీసర్‌కు చెక్‌ అందజేస్తారు. నిధులు విడుదల కాకపోవడంతో ఇవేమి జరగడం లేదు. అయితే కళాశాలల్లో  నిధులతో అవసరం లేని స్వచ్ఛ భారత్, హరితహారంలాంటి కార్యక్రమాలను మాత్రం నిర్వహిస్తున్నారు. 

రాష్ట్ర స్థాయి సమావేశంలో చర్చ.. 
ఇటీవల హైదరాబాద్‌లో అన్ని యూనివర్సిటీల ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్లు కూడా ఈ ఏడాది నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని, ఇప్పటికే జాప్యమైందని రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు కాగానే విడుదల చేస్తామని సదరు అధికారి సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే ఆ నిధులు ఎప్పుడొస్తాయనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్లు భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోలేపోతున్నారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించే ఎన్‌ఎస్‌ఎస్‌కు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top