టీఆర్‌ఎస్‌  'రామా'బాణం!         

KTR Said Going To Be Taken Up In The Development Of The peddapalli Constituency Like Cyrillilla - Sakshi

పెద్దపల్లి, గోదావరిఖనిలో కేటీఆర్‌ ప్రచారం 

సభల సక్సెస్‌తో గులాబీలో జోష్‌ 

ఎన్నికల ప్రచారానికి 48 గంటలు మాత్రమే గడువున్న ఆఖరు సమయంలో టీఆర్‌ఎస్‌ రామబాణం ప్రయోగించింది. గులాబీ బాస్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలతో నెలకొన్న జోష్‌ను కొనసాగించేందుకు యువనేత కేటీఆర్‌ సోమవారం జిల్లాలో పర్యటించారు. పెద్దపల్లి, గోదావరిఖనిలో కేటీఆర్‌ నిర్వహించిన బహిరంగసభలు విజయవంతం కావడంతో ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది. 

సాక్షి, పెద్దపల్లి: టీఆర్‌ఎస్‌ యువనేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సోమవారం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గోదావరిఖని, 2.30 గంటలకు పెద్దపల్లి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలు నిర్వహించిన స్థలాల్లోనే కేటీఆర్‌ సభలను ఏర్పాటు చేశారు. రెండు సభల్లోనూ ఆయన దాదాపు అరగంట పాటు ప్రసంగించారు. తన ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభివృద్ధిని వివరించడంతో పాటు, కాంగ్రెస్, బీజేపీలను మరీ ముఖ్యంగా చంద్రబాబును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. విపక్షాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సభికుల నుంచి స్పందన కనిపించింది. మధ్యలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ, తన సహజ శైలిలో సాగిన కేటీఆర్‌ ప్రసంగం ఆకట్టుకుంది. పెద్దపల్లిలో పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డిపై కేసీఆర్‌ తరహాలోనే కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు.

తాను చూసిన ఎమ్మెల్యేల్లో ఇంత మంచి ఎమ్మెల్యే లేడంటూ, సొంత డబ్బులు ఖర్చుపెట్టి హరితహారాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. పలుమార్లు స్థానిక అంశాలను కేటీఆర్‌ ప్రస్తావించడంతో సభికుల నుంచి స్పందన లభించింది. మళ్లీ దాసరి మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే, కేసీఆర్‌ సీఎం అయితే నియోజకవర్గంలోని చివరి ఎకరాకు కూడా నీళ్లందిస్తామంటూ హామీ ఇచ్చారు. అంతేగాకుండా తాను వ్యక్తిగతంగా ఇందుకు బాధ్యత తీసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల తరహాలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతానన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పదమూడు స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవల కేసీఆర్‌ సభలు, సోమవారం కేటీఆర్‌ సభలు విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.

 
సెంటిమెంట్‌...సెటిల్‌మెంట్‌...ప్లేస్‌మెంట్‌...పనిష్‌మెంట్‌ 
సుల్తానాబాద్‌లో విజయశాంతి రోడ్‌షో 
కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలి స్టార్‌ క్యాంపెయినర్‌ సోమవారం జిల్లాకు వచ్చారు. సినీ నటి విజయశాంతి సుల్తానాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు పర్యటించకపోవడం తెలిసిందే. రేవంత్‌రెడ్డి సభలు ఉంటాయని ముందుగా ప్రచారం జరిగినా, ఇప్పటివరకు స్పష్టత రావడంలేదు. ప్రచారానికి మరో రెండు రోజులు ఉండడంతో చివరివరకైనా రేవంత్‌రెడ్డిని తీసుకురావాలనే ప్రయత్నంలో పార్టీ నేతలున్నారు. రోడ్‌షోలో ప్రజలను ఆకట్టుకోవడానికి విజయశాంతి ప్రయత్నించారు. ఉద్యమ సమయంలో సెంటిమెంట్, అధికారంలోకి వచ్చాక సెటిల్‌మెంట్, తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులకు మంత్రి వర్గంలో ప్లేస్‌మెంట్, ఇదేంటని ప్రశ్నిస్తే మనకు పనిష్‌మెంట్‌ అంటూ కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్లు విసిరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top