హాజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్

సాక్షి, యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అత్యంత దారుణంగా హత్యలకు గురైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ ఘటనలు బాధాకరమన్న ఆయన హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. కాగా హత్యకు గురైన చిన్నారుల కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతూ... బొమ్మల రామారం మండలం మాల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటన పట్ల సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. నెలాఖరులో హాజిపూర్ గ్రామాన్ని సీఎం,కేటీఆర్ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్‌లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి