రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా గళమెత్తండి..

KTR Meeting With MPs Over Parliament Budget Sessions - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎంపీలతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశం

ఎన్పీఆర్‌లో ఓబీసీ జనగణన కాలమ్‌ చేర్చాలి

విభజన చట్టం హామీల అమలుపై నిలదీయండి

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలో జరిగే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్టీ ఎంపీలు గళమెత్తాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు. సీఏఏ విషయంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పార్లమెంటులో వ్యవహరించాలని, ఎన్పీఆర్‌లో ఓబీసీ జనగణన కాలమ్‌ను చేర్చాలనే డిమాండు లేవనెత్తాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణభవన్‌లో మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్‌ అధ్యక్షత వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ ఇతర బకాయిలపై పార్లమెంటులో నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని గతంలో నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా, ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు రాని విషయాన్ని ప్రస్తావించాలని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, తెలంగాణకు హరితహారం, మిషన్‌ భగీరథ పథకాల స్ఫూర్తితో కేంద్రం కూడా అనేక పథకాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేయాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధుల సాయం లేకున్నా విజయవంతంగా పనులు సాగుతున్న విషయాన్ని ప్రస్తావించాలన్నారు. నిధులు, దీర్ఘకాల డిమాండ్లపై నిలదీయండి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్‌ ప్లాంటు, ట్రైబల్‌ యూనివర్సిటీ వంటి డిమాండ్లతో పాటు, తెలంగాణకు దక్కాల్సిన నిధులపై నిలదీయాలని పార్టీ ఎంపీలకు కేటీఆర్‌ సూచించారు. దేశంలో ఓ వైపు ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండగా, నిరుద్యోగ సమస్య, ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి కీలక అంశాలపై కేంద్రం దృష్టి పెట్టకపోవడాన్ని ప్రశ్నించాలన్నారు. సీఏఏ, ఎన్నార్సీ వంటి రాజకీయ అంశాలను పక్కన పెట్టాలని కేంద్రానికి సూచించాలని పేర్కొన్నారు.

మున్సిపోల్స్‌ ఘన విజయంపై తీర్మానం
మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎన్నడూ లేని విధంగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ తీర్మా నంచేసింది. పార్టీ అధికారంలో వచ్చిననాటి నుంచి ఆయా వర్గాల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు చేపట్టిన సీఎం.. రాజకీయంగా వారికి ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం సీఎం కేసీఆర్‌ కృషి వల్లే సాధ్యమైందని, పార్టీని విజయం దిశగా నడిపించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ అభినందింది. కాగా, బుధవారం ఢిల్లీలో జరిగే పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ ప్రాధాన్య అంశాలను పార్లమెంటు సమావేశాల ఎజెండాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తామని పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు వెల్లడించారు.

కేటీఆర్‌తో మున్సిపల్‌ చైర్మన్లు భేటీ
కొత్తగా ఎన్నికైన సుమారు 50 మందికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పాలక మండలి సభ్యులు మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీరిని వెంట బెట్టుకుని తెలంగాణ భవన్‌కు రావడంతో సందడి నెలకొంది. జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా కేటీఆర్‌ వారితో గ్రూప్‌ ఫొటో దిగి అభినందించారు. కాగా, కరీంనగర్‌ మున్సిపాలిటీలో గెలుపొందిన ఏడుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top