ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది

KTR Inaugurates Oncology Unit New Building In NIMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం నిమ్స్‌ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన అంకాలజీ భవనాన్ని అపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మెగా ఇంజనీరింగ్‌ సంస్థ ఆంకాలజీ భవనాన్ని నిర్మించడమే కాకుండా మూడు సంవత్సరాలు మెయిన్‌టెన్‌ చేస్తామని చెప్పటం ఆనందంగా ఉందన్నారు. వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. నిమ్స్‌లో అవయవ మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. సామాన్యులకు అందని కార్పొరేట్‌ వైద్యం పేదలకు నిమ్స్‌లో అందుతుందన్నారు. కేసీఆర్‌ కిట్‌ వచ్చాక రాష్ట్రంలో నార్మల్‌ డెలివరీలు పెరిగాయని పేర్కొన్నారు. తెలంగాణలో మాత శిశు మరణాలు తగ్గిపోయాయన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. మిషన్‌ ఇంద్ర ధనస్సులో తెలంగాణ దేశంలో ముందుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 45 బస్తీ దవాఖానాలు ప్రాంభిచామని.. వచ్చే ఏడాది మే నాటికి 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైద్య పరీక్షలు సైతం ప్రభుత్వమే ఉచితంగా చేస్తోందన్నారు. విజన్‌ ఫర్‌ ఆల్‌ నినాదంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రభత్వ రంగంలోని వైద్యులు సిబ్బంది బాగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. డిజిటల్‌ హెల్త్‌ రికార్డ్స్‌ మొదలు పెట్టాలని సూచించారు.

డీన్‌ నియామకాన్ని రద్దు చేయాలి
నిమ్స్‌ డీన్‌గా ఆర్వీ కుమార్‌ నియామకాన్ని రద్దు చేయాలని ఆందోళన చేపట్టిన రెసిడెంట్‌ డాక్టర్లు కేటీఆర్‌, లక్ష్మారెడ్డిలను కలిశారు. కాగా రెసిడెంట్‌ డాక్టర్ల డిమాండ్లపై కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top