కేటీఆర్‌ మాటలు మితిమీరుతున్నాయ్‌

ktr crossing his limits said ponguleti sudhakar reddy - Sakshi

సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి 

సత్తుపల్లి : దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని కేసీఆర్‌ పుత్రరత్నం కేటీఆర్‌కు విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్సీ, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. రోజురోజుకు కేటీఆర్‌ మాటలు మితిమీరుతున్నాయన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీలో సింగరేణి బాంబు బ్లాస్టింగ్‌లతో దెబ్బతిన్న ఇళ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శాసన మండలి హక్కుల కమిటీలో సభ్యుడి హోదాలో సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న నష్టాలను స్వయంగా పరిశీలించేందుకు వచ్చానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్యూరిటీని పక్కన బెట్టి మారువేషాల్ల తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాటిని విస్మరించి ప్రజలను వంచించారన్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ మార్క్‌ ప్రజాస్వామ్యం, దేశంలో మోదీ మార్క్‌ ప్రజాస్వామ్యం నడుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ.40వేల కోట్లు ఇవ్వకపోయినా మంత్రులు, ఎంపీలు నోరు మెదపటం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ బస్‌ యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన మంచినీటి పథకాలకు పేరుమార్చి మిషన్‌ భగీరథ పథకాలుగా గొప్పగా చెప్పుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పార్టీ ఫిరాయించి 11వేల గజాలు అక్రమంగా రెగ్యులైజ్‌ చేసుకున్నారని ఆరోపించారు. ఖమ్మం డీసీసీబీ అక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విజిలెన్స్‌తో విచారణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానన్నారు. అనంతరం సింగరేణి పీఓ బి.సంజీవరెడ్డిని కలిసి బ్లాస్టింగ్‌ సమస్యలను వివరించారు. ఆయన వెంట యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి మనోహర్‌నాయుడు, డీసీసీ కార్యదర్శి గాది రెడ్డి సుబ్బారెడ్డి, తుంబూరు ప్రతాప్‌రెడ్డి, కేశబోయిన నర్సింహారావు, ప్రకాష్, నందునాయక్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top