బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు

KTPS Neighbourhood People Facing Problems With Ash - Sakshi

సాక్షి, పాల్వంచ: కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) నుంచి వెలువడే వృథా బూడిద నిల్వలు ఉండే..యాష్‌పాండ్‌ చుట్టు పక్కల ప్రాంతాల వారు బెంబేలెత్తుతున్నారు. ఈ బూడిద కాలుష్యంతో యాష్‌పాండ్‌కు సమీపంలో పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం గ్రామాల ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బూడిద గాలిలోకి లేవకుండా కేటీపీఎస్‌ యాజమాన్యం ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెస్పిటెటర్‌ (ఈఎస్‌పీ)లను ఉపయోగిస్తున్నా..పనితీరు సక్రమంగా లేకపోవడంతో కాలుష్యం వెదజల్లుతోంది. నీటిద్వారా యాష్‌పాండ్‌కు తరలిస్తున్నారు.

సమీపంలోని కాల్వలు, కిన్నెరసాని ప్రాంతం బూడిదతో నిండి కాలుష్యభరితంగా మారుతున్నాయి. పీల్చుతున్న కార్మికులు, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. జెన్కో టన్ను రూ.10చొప్పున విక్రయిస్తుండగా.. ప్‌లైయాష్‌ను సిమెంట్, ఇటుకల కంపెనీలు ప్రతిరోజూ వెయ్యి టన్నుల బూడిదను తీసుకెళ్తుంటాయి. మిలిగిన నిల్వలు అలా పేరుకుపోతుంటాయి. నిత్యం వందలాది లారీల లోడ్లను హైదరాబాద్, మిర్యాలయగూడెం, జగ్గయ్యపేట, కట్టగూడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక లోడ్‌తో ఊరి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. గాలికి బూడిద రోడ్లపై, నివాసాలపైకి చేరి ఇబ్బంది పడుతున్నారు.

బూడిదతో కూడిన గాలి పీల్చడం వల్ల స్థానికులు ఆయాసం, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల ఒంటిపై దురదలు వస్తున్నాయి. ఇటీవల కేటీపీఏస్‌ యాజమాన్యం కిన్నెరసాని ప్రధాన రహదారినుంచి యాష్‌పాండ్‌ వరకు తారురోడ్డు నిర్మించగా..25టన్నుల లోడుకు బదులు 30 నుంచి 40 టన్నుల బూడిద లోడు ఒక్కో లారీలో తరలిస్తుండడంతో అది కూడా అధ్వానంగా మారింది. యాష్‌పాండ్‌ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మేతకు వెళ్లి పశువులు, మేకలు, గొర్రెలు బూడిద గుంతల్లో ఇరుక్కుపోయి మరణిస్తున్నాయి.

అనేకమార్లు నోటీసులు..

యాష్‌పాండ్‌లో పడి మృతి చెందిన పశువులు 

కేటీపీఎస్‌ కర్మాగారం ద్వారా బూడిద చెరువులోకి పంపిస్తున్న బూడిద సమీపంలోని కిన్నెరసాని వాగులో కలవడం ద్వారా పశువులు, పంటల దెబ్బతింటున్నాయి. బూడిద కాలుష్యాన్ని కిన్నెరసానివాగులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. కర్మగారంలో సెడ్మెంటేషన్‌ ట్యాంక్‌ను నిర్మించాలని, బూడిద నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ఆచరణకు నోచట్లేదు. 

పొలం, జలం.. బూడిదమయం
యాష్‌పాండ్‌ పరిసరాలన్నీ బూడిదతో నిండి కనిపిస్తుంటాయి. సమీపంలోని కిన్నెరసాని వాగు జలం రంగు మారి ప్రవహిస్తుంటుంది. పొలాలన్నీ సారం కోల్పోతున్నాయి. ఈ నీళ్లను తాగిన పశువులు చనిపోతున్నాయి. జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top