తీపి కల తీరెన్‌

Kothapet Fruit Market Shifting to Koheda Approval - Sakshi

కోహెడకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ తరలింపు

తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానికుల స్వప్నం సాకారం  

ఎల్‌బీనగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంత వాసులకుతీపి కబురు. ఇక్కడి పండ్ల మార్కెట్‌ తరలింపు ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2011 నుంచి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేస్తున్న సుదీర్ఘ పోరాటం ఫలించినట్లయ్యింది. సుమారు 9 ఏళ్లుగా మార్కెట్‌ తరలింపు విషయంలో మంత్రులతో పాటు అధికారులతో పలు దఫాలుగా ఆయన చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే తరలింపునకు పునాది పడినా జీఓలు జారీ చేయకపోవడంతోపాటు
స్థల సేకరణ విషయంలో  జాప్యం ఏర్పడింది. ఇన్నేళ్ల తర్వాత ఓ కొలిక్కి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇక తరలింపే ఆలస్యం..  
కోహెడలో 178 ఎకరాల ప్రభుత్వ భూమిలో మార్కెట్‌ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్‌ శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కొన్నేళ్లుగా మామిడి సీజన్‌ రాగానే మార్కెట్‌ తరలింపు ఇదిగో అదిగో అంటూ అధికారులు తర్జనభర్జన పడేవారు. 1986లో కొత్తపేటలో 22 ఎకరాల స్థలంలో అప్పటి ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను తరలించేందుకు నిర్ణయించారు. శివారు ప్రాంతం కావడంతో అనువుగా ఉందని నగరంలోని మార్కెట్‌ను ఇక్కడికి తరలించారు. జనాభా పెరగడం, కాలనీలు విస్తరించడం, వాహనాల సంఖ్య పెరగడంతో కాలుష్యంతో పాటు ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా తలెత్తింది. దీంతో సుధీర్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే పండ్ల మార్కెట్‌ తరలింపునకు ప్రణాళికలు వేశారు. అప్పట్లో జీఓ వస్తుందనే సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మరుగున పడింది. 2014 ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఓటమి చెందారు. దీంతో మార్కెట్‌ తరలింపు విషయం పూర్తిగా ఆగిపోయింది. ఆయన తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మార్కెట్‌ తరలింపుపై పలు పట్టుబట్టారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పలుమార్లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు జీఓ విడుదలైంది.  మొత్తానికి మార్కెట్‌ తరలింపు విషయంలో సుధీర్‌రెడ్డి కల నిజమైందని చెప్పవచ్చు. కాగా.. కోహెడకు మార్కెట్‌ తరలింపే ఇక ఆలస్యమని సమాచారం.

ఈసారి మామిడి సీజన్‌ ఎక్కడ..?
ఈసారి మామిడి సీజన్‌ ఎక్కడ నిర్వçహించాలనే విషయమై పాలక మండలి, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మామిడి సీజన్‌లో రోజుకు సుమారు 400 నుంచి 600 లారీలు వస్తుంటాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉండడడంతో గత సంవత్సరమే కోహెడలో నిర్వహించాలనుకున్నా అది కుదరలేదు. ఈసారి కూడా సాధ్యం కాకపోవచ్చనే తెలుస్తోంది. తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయాలన్న సమయం లేకపోవడంతో ఈసారి ఇక్కడే మామిడి సీజన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మామిడి సీజన్‌ వచ్చే నెల నుంచే ప్రారంభం కానుండటంతో అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. ఈ దఫా మామిడి సీజన్‌ను గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లోనే నిర్వహించాలనే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చైర్మన్‌ వీరమల్ల రాంనర్సింహ గౌడ్‌ అన్నారు. ఈ విషయంపై వారం రోజుల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top