
హైదరాబాద్ నగరానికి విదేశాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నాయి. న్యూజిలాండ్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, దక్షిణాఫ్రికా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, సౌదీ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫలాలు వస్తున్నాయి. ప్రధానంగా యాపిల్, కివీ, ప్లం, పియర్, డ్రాగన్, ఖర్జూర, చెర్రీ వంటి ఖరీదైన పండ్లు విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాయి.
విదేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వెరైటీల పండ్లు సరఫరా అవుతున్నాయి. కొన్ని ప్రూట్స్ ఏడాది పొడవునా..మరికొన్ని సీజన్ వారీగా విపణిలో అందుబాటులో ఉంటున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా అరటి, నారింజ, దానిమ్మ, నల్ల ద్రాక్ష, పైనాపిల్, జాక్ ఫ్రూట్ వంటివి దిగుమతి అవుతున్నాయి. మోసంబీ, సీతాఫలం, బొబ్బాయి, మామి డి, జామ, పుచ్చకాయ వంటి పండ్లు రంగారెడ్డి, వికారాబాద్‌లతో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో సాగవుతున్నాయి.
హైదరాబాద్‌లో ప్రధానంగా బాటసింగారం, మోజంజాహీ, గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి పండ్ల మార్కెట్లు ముఖ్యమైనవి. పోషక అవసరాలను తీర్చడంలో ఉద్యానవన ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా తర్వాతి నుంచి ప్రజల ఆహార అలవాట్లలో స్పష్టమైన మార్పులు వచ్చాయి.
ఒత్తిడి, బిజీ పనుల కారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. దీంతో పండ్లు, కూరగాయల వినియోగం పెరిగింది. దీంతో రైతులు కూడా వైవిధ్యమైన తోటలను సాగు చేస్తున్నారు. మరోవైపు ఉద్యానవన సాగుతో కార్మిక శక్తికి ఉపాధి అవకాశాలను అందించినట్లవుతుంది. బాటసింగారం మార్కెట్‌లోకే 2023–24లో 4,65,633 టన్నుల పండ్లు దిగుమతి అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం తెలిపింది.
రంగారెడ్డిలో 94 వేల ఎకరాల్లో సాగు..
గ్రేటర్‌లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఉష్ణమండలం, సహజ వనరులు, అనువైన నేలలతో పాటు విస్తారమైన భూమి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 94,139 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. జిల్లాలోని మొత్తం పంట విస్తీర్ణంలో ఉద్యానాల సాగు విస్తీర్ణం వాటా 30–40 శాతం వరకు ఉంటుంది.
ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి, జామ, తీపి నారింజ, దానిమ్మ, ఆమ్ల నిమ్మ, పుచ్చకాయ ప్రధానంగా సాగు అవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఉద్యానవన పంటలు లాభదాయకయమైన రాబడిని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాసెసింగ్ పరిశ్రమకు ముడి పదార్థాలను అందించడం, ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం వంటి కారణాలతో గణనీయమైన ప్రాముఖ్యతను పొందుతుంది.
ఖరీదు ఎక్కువే..
విదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లు ఖరీదైనవే ఉంటున్నాయి. డ్రాగన్, కివీ, ఖర్జూర, చెర్రీ వంటి పండ్లు ఎక్కువ ధర పలుకుతుండగా.. సాగు, సీజన్‌ను బట్టి మామిడి, యాపిల్, దానిమ్మ ధరలు కూడా అధికంగానే పలుకుతున్నాయి.
నగరంలో డ్రాగన్ ఫ్రూట్ ధర క్వింటాల్‌కు రూ.1,13,610లుగా ఉండగా.. పియర్ రూ.30 వేలు, కివీ రూ.18,471, చెర్రీ రూ.24,975, నల్ల ద్రాక్ష రూ.17,344, ఖర్జూర రూ.16,100, మామిడి రూ.13,338, యాపిల్ రూ.15,927, దానిమ్మ రూ.14,225లుగా ఉన్నాయి. ఇక సపోటా, మోసంబీ, బొప్పాయి, నారింజ, అరటి వంటి లోకల్ ఫలాలు ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉన్నాయి.
(చదవండి: Japanese Tradition: ‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!)