
సాక్షి, నల్గొండ: నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజక వర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ఒక్క టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాలు విసిరారు. నల్లగొండ పేరు తలుచుకుంటే కేసీఆర్‌కు నిద్ర పట్టదన్నారు. తెలంగాణ మనందరి కోసం రాలేదని, కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే కేసీఆర్ మోసం చేశారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ నాయకులందరం కొట్లాడి తెలంగాణ ఇప్పించామన్నారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నారు. కానీ, పిల్లయిపల్లి కాలువ మాత్రం పూర్తి చేయడం లేదన్నారు. రాజకీయం కోసమో డబ్బు కోసమో కోమటిరెడ్డి బ్రదర్స్ పనిచేయరని తెలిపారు. ప్రజల కోసమే పనిచేస్తామని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు.