కోదండరాం అరెస్టు

Kodandaram Arrested At Nampally - Sakshi

అంతకుముందు గృహనిర్బంధం

దీంతో ఇంటి వద్దే జెండా ఎగురవేసిన టీజేఎస్‌ అధ్యక్షుడు

అనంతరం పార్టీ కార్యాలయంలోనూ పతాక ఆవిష్కరణ

ఆ వెంటనే కోదండరాం అరెస్టు.. సాయంత్రం విడుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సోమ వారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన కొద్దిసేపటికే అధ్యక్షుడు ప్రొ.కోదండరాంను పోలీసులు అరెస్ట్‌ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటర్‌ ఫలితాల గందరగోళానికి బాధ్యులపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకో వాలని, బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఇంటర్‌బోర్డు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ  పార్టీల ముఖ్య నేతల గృహనిర్బంధం, విద్యార్థి, ప్రజాసంఘాల వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు, ఇంటర్‌ బోర్డు వద్ద నిరసనలకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీసు స్టేష న్లకు తరలించారు. తార్నాకలోని నివాసంలో కోదండరాంను ఉదయం నుంచి గృహ నిర్బంధంలోనే ఉంచడంతో టీజేఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటి ఆవరణలోనే పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు.

పోరాటాలతోనే జన సమితి ఆవిర్భవించిందని, పార్టీ తొలి ఆవిర్భావ దినోత్సవం కూడా నిర్బంధాల మధ్య జరుపుకోవాల్సి వచ్చిందని కోదండరాం పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం టీజేఎస్‌ పోరాటాలు చేసిందని, ప్రజల భావవ్యక్తీకరణకు అనుగుణంగా పార్టీ ప్రయాణం సాగుతోందన్నారు.   తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాటాలు చేస్తామన్నారు. టీజేఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని కార్యాల యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం గురించి తెలియజేయడంతో అక్కడకు వెళ్లేందుకు కోదండరాంను పోలీసులు అనుమతించారు. అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన్ను, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం కోదండరాంను, ఇతర పార్టీల నేతలను రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్‌ నుంచి విడుదల చేశారు.  

బాధితులకు న్యాయమేదీ...
ఇంటర్‌ ఫలితాల విషయంలో తప్పు జరిగిందని అం గీకరించాక, సమస్య పరిష్కారానికి చర్యలతోపాటు బాధితులకు న్యాయం చేసేందుకు కార్యాచరణను ప్రకటించాల్సిన ప్రభుత్వం అటువంటిదేమీ చేయలేదని కోదండరాం విమర్శించారు. విడుదలయ్యాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫలితాల గందరగోళానికి కారణమైన కంపెనీకి సామర్థ్యం లేకపో యినా బాధ్యతలు అప్పగించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోకపోవడం, విద్యార్థుల పరీక్షాపత్రాల మూ ల్యాంకనంపై సమీక్ష నిర్వహించపోవడం, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారంపై కార్యాచరణను ప్రకటించకపోవడం ప్రభుత్వ తప్పిదమన్నారు. దీనిపై శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులను ఆదివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేయడం అక్రమమన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రయోగించి ఇదే తమ నిర్ణయం అని పోలీసుల ద్వారా ప్రభుత్వం ప్రకటించినట్లు అయిందని ఆయన పేర్కొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top