ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టండి: కిషన్‌రెడ్డి 

Kishan Reddy Talk On Private Hospitals Exploitation On Coronavirus - Sakshi

సచివాలయ కట్టడి కాదు..

ముందు కరోనాను కట్టడి చేయండి 

సాక్షి, న్యూఢిల్లీ: కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరోనా ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రైవేటు ఆస్పత్రుల అడ్డగోలు దోపిడిని అరికట్టాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సచివాలయం కట్టాలా? కూల్చాలా? విషయం పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌తో కలసి తెలంగాణలో విస్తృమవుతున్న కరోనా తీరుపై బుధవారం ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ ఎంపీగా, తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రిగా తెలంగాణ ఆరోగ్యమంత్రి, అధికార యంత్రాంగంతో నిరంతరం మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.

7.14 లక్షల మాస్క్‌లు, 2.41 లక్షల పీపీఈ కిట్స్, 23 లక్షల హైడ్రాక్సిక్లోరిక్విన్‌ మాత్రల్ని కేంద్రం తెలంగాణకు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. వెంటిలేటర్ల విషయమై కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరగా 1,220 వెంటిలేటర్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, 688 వెంటిలేటర్లు తెలంగాణకు పంపినట్లు వివరించారు. తెలంగాణకు 1.22 లక్షల ఆర్‌ఎన్‌ఏ కిట్స్, ఆర్టీపీసీఆర్‌ కిట్స్‌ 2.90 లక్షలు, 52 వేల వీటీఎం కిట్లను కేంద్రం ఇచ్చిందని, అదనపు కిట్లను కూడా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. వైద్యశాఖ తరుపున రూ. 215 కోట్ల మేర నిధులను తెలంగాణకు ఎక్విప్‌మెంట్‌ కోసం ఇచ్చినట్లు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చామని తెలిపారు. కొత్త కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటుచేసుకోవడం గానీ, లాక్‌డౌన్‌ విషయంలో గానీ పూర్తిస్వేచ్ఛ ఉందని, కేంద్రం అన్ని విధాల సాయం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారన్నారు. అవసరమైతే ఢిల్లీ తరహాలో 10 వేల పడకల ఆస్పత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని సూచించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top