స్వచ్ఛం..సహజం..

Khammam People Summer Special Tunica Fruits - Sakshi

ఎవర్‌గ్రీన్‌ ఆహారంగా తునికి పండ్లు

అడవిలో నిత్యం అందుబాటులో..

జంతువుల ఆకలినీ తీరుస్తున్న ఫలాలు

పోషక విలువలు ఉండడంతో భలే డిమాండ్‌

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం:ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఆహారం తీసుకున్నా శరీరానికి అవసరమయ్యే పోషకాల కంటే రసాయనాలే ఎక్కువగా ఉంటున్నాయి. చీడపీడల ¯నుంచి కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడి కోసం కూరగాయాలు, పండ్లు తదితర పంటలకు ఎరువులు, పురుగు మందులను విచ్చలవిడిగా వేస్తున్నారు. అయితే గత్యంతరం లేక ఎక్కువ మంది వీటినే వినియోగిస్తున్నారు. కానీ అటవీ ఫలాలు మాత్రం స్వచ్ఛంగా లభిస్తున్నాయి. ఇందులో అత్యంత పోషక విలువలు కలిగిన, అప్పటికప్పుడు తినదగిన తునికి పండ్లు (టెండూ ఫ్రూట్‌) ప్రస్తుతం జిల్లాలో భారీ గానే లభిస్తున్నాయి. ఎవర్‌ గ్రీన్‌ అటవీ ఆహారంగా ఈ పండ్లకు పేరుంది. జిల్లాలోని పలువురు గిరిజనులు, గిరిజనేతరులు ఈ పండ్లను చాలా ఇష్టంగా తింటారు. వీటి సేకరణకు ప్రత్యేకంగా అడవుల్లోకి వెళుతుంటారు. ఒక్కో చెట్టు ఏడాదికి ఐదువేల కాయలు కాస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో లభించే ఈ కాయలను వరిగడ్డి లేదా ఇసుకలో మాగబెడితే పండుతాయి. మైదాన ప్రాంతాల్లో తాటిముంజలు ఎంత సహజంగా ఉంటాయో.. అడవిలో లభించే తునికి పండ్లు అంతకన్నా బాగుంటాయని గిరిజనులు చెబుతున్నారు. వీటిని కోతులు, వివిధ రకాల జంతువులు సైతం ఇష్టంగా తింటాయి.

సేకరించి అమ్ముకుంటాం
ప్రతి సంవత్సరం తునికి కాయలు సేకరిస్తున్నా. గిరిజ నులంతా ఈ కాయలను తినేందుకు ఉవ్విళ్లూరుతారు. కొన్ని మేము తిని, మిగిలినవి అమ్ముకుంటాం. ఈ సీజన్‌లో తునికి కాయలు కొనుగోలు చేసేందుకు చాలామంది ఎదురు చూస్తుంటారు.– మైత ఎర్రక్క, కరకగూడెం

ఇష్టంగా సేకరిస్తాం
తునికి పండ్లు అంటే మాకు చాలా ఇష్టం. ఈ కాయలను సేకరించి వరిగడ్డిలో మాగబెట్టుకుంటాం. పండిన వెంటనే తింటాం. ఇవి ఎండిపోయినా మంచి రుచిగా ఉంటాయి.  – కొమరం సింధురాణి, కరకగూడెం

పోషకాలు ఎక్కువ
తునికి పండ్లు స్వచ్ఛమైనవి.  గాలికి కిందపడినా ఇబ్బంది ఉండదు. సపోటా పండులో వలె గుజ్జు ఉంటుంది. ఈ పండ్లలో ఏ, సీ విటమిన్లు ఎక్కువ. ఇవి తింట్లు కడుపులో పుండ్లు ఉంటే తగ్గుతాయి. రక్తం శుభ్రపడుతుంది.   – దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top