సామాజిక బాధ్యతగా.. | Khammam People Awareness on Social Distance | Sakshi
Sakshi News home page

సామాజిక బాధ్యతగా..

Mar 27 2020 11:55 AM | Updated on Mar 27 2020 11:55 AM

Khammam People Awareness on Social Distance - Sakshi

కొత్తగూడెంలోని ఓ మెడికల్‌ షాపు వద్ద సామాజిక దూరం పాటిస్తున్న వినియోగదారులు

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కోవిడ్‌–19 వైరస్‌ మరింత ప్రబలకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన లాక్‌డౌన్‌ జిల్లాలో ఐదోరోజు గురువారం పకడ్బందీగా కొనసాగింది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుండడంతో ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతోంది. దీంతో సామాజిక దూరం పాటిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, మెడికల్‌ షాపులకు వస్తున్న జనం ఒక్కో మీటరు దూరం పాటిస్తున్నారు. పోలీసులు ముఖ్యమైన అన్నిచోట్ల పహారా కాస్తూ ప్రతిఒక్కరినీ గమనిస్తున్నారు. అయితే పొగరాయుళ్లు మాత్రం ఇప్పటికీ తమ పద్ధతి మార్చుకోవడం లేదు. కూరగాయలు, కిరాణా దుకాణాలు, మెడికల్‌ షాపుల వద్ద యథేచ్ఛగా సిగరెట్లు తాగుతున్నారు. కోవిడ్‌ విషయంలోఇంత స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో పొగరాయుళ్లు కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న కిందిస్థాయి పోలీస్‌ సిబ్బందికి పూర్తిస్థాయిలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు లేవు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతిఒక్కరినీ పరిశీలనగా చూడాల్సిన నేపథ్యంలో పోలీసు సిబ్బందికి ఆధునిక మాస్కులు, పరికరాలు ఇవ్వాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో పారిపోతున్నవారిని, అసాంఘిక శక్తులను పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి కోవిడ్‌ వైరస్‌ ఉంటుందో, ఎవరికి ఉండదో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తగిన పరికరాలు కల్పించాలని పోలీస్‌ సిబ్బంది కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందజేస్తున్న వైద్య సిబ్బందికి సైతం మరింతగా రక్షణ ఇచ్చేలా పరికరాలు కల్పించడంతో పాటు, వారిలో అవగాహన, ధైర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడం, ఇక్కడ ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వ్యాపారులు కూరగాయల ధరలను మరింతగా పెంచడంతో వినియోగదారులు వాపోతున్నారు. కిరాణా సరుకులు సైతం ఆయా దుకాణాల్లో పూర్తిస్థాయిలో దొరకడం లేదు.

ఛత్తీస్‌గఢ్‌లోని కుంట ప్రాంతం నుంచి జిల్లాలోని జూలూరుపాడు తదితర మండలాల్లో మిరప తోటల్లో కాయలు ఏరేందుకు వలస వచ్చిన కూలీలు తిరిగి తమ ఊరికి వెళ్లేందుకు అనేక అగచాట్లు పడుతున్నారు. ఆదివాసీ గిరిజనులైన వీరు ఖమ్మం–జగదల్‌పూర్‌ ప్రధాన రహదారి గుండా నడిచి వెళుతున్నారు.
మసీదుల్లో ముస్లింలు నమాజ్‌ చేసే విషయంలో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక సర్క్యులర్‌ విడుదల చేసింది. ఈ సర్క్యులర్‌ను జిల్లా కలెక్టర్‌లకు పంపించారు. నమాజ్‌ సమయంలో ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ ఉండరాదని, ఈ అంశాన్ని మసీదు కమిటీలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ముస్లింలు పవిత్రంగా భావించే శుక్రవారం నమాజు(జుమా)కు సైతం ఐదుగురు మాత్రమే ఉండాలని సూచించింది. అందరు ముస్లింలు ఇళ్లవద్దే నమాజు చేసుకోవాలని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement