హైవే.. సర్వే 

Khammam To Amravati Highway Road Sary - Sakshi

ఖమ్మంఅర్బన్‌: జిల్లాకు మరో జాతీయ రహదారి రానుంది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఓ ఏజెన్సీ బృందం జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఫ్యూజిబులిటీ(సాధ్యాసాధ్యాలు) సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారి, వరంగల్‌ నుంచి ఖమ్మం జిల్లాను కలిపే విధంగా ఒక జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేసి.. సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డుకు నిధులు మంజూరు చేసి.. భూ సేకరణ చేపట్టిన విషయం విదితమే. తాజాగా మరో జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే బృందం.. జిల్లాలోని రఘునాథపాలెం మండలం వీవీపాలెం వద్ద నూతన కలెక్టరేట్‌కు కుడివైపున ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ రోడ్డును ఆనుకొని శనివారం సర్వే చేసింది.

ఇప్పటికే ఖమ్మం మీదుగా కురవి, మహబూబాబాద్‌ వరకు, సూర్యాపేట మీదుగా దేవరపల్లి వరకు జాతీయ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. వీటితోపాటు ఖమ్మం మీదుగా ఏపీ రాష్ట్రంలోని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి నిర్మించే చర్యల్లో భాగంగానే ఈ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా విజయవాడ సమీపంలోని గ్రామం వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు ఫ్యూజిబులిటీ సర్వే చేపట్టింది. ఇల్లెందు రోడ్డులోని రఘునాథపాలెం బైపాస్‌ సమీపం నుంచి వైఎస్సార్‌ నగర్‌ కాలనీ సమీపంలోని వీవీపాలెం వద్ద నూతన కలెక్టరేట్‌ సమీపం నుంచి చింతకాని, బోనకల్‌ మండలాలను కలుపుతూ విజయవాడ సమీపం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి సర్వే చేపట్టారు.

ఖమ్మం నుంచి విజయవాడ సమీపం వరకు 70 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టినట్లు బృందం సభ్యులు తెలిపారు. 70 కిలో మీటర్ల పొడవు.. 300 అడుగుల వెడల్పుతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను అనుసంధానం చేసే విధంగా జాతీయ రోడ్డు ఉంటుందని తెలిసింది. ఇందుకోసం కోల్‌కతా రాష్ట్రానికి చెందిన జీజీ కంపెనీకి చెందిన సంస్థతో నెల రోజులుగా ఫ్యూజిబులిటీ సర్వే నిర్వహిస్తున్నారు. ఇల్లెందు రోడ్డు రఘునాథపాలెం బైపాస్‌ నుంచి వీవీపాలెం సమీపంలోని ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపం నుంచి చింతకాని మండలం, బోనకల్‌ మండలాల మీదుగా సర్వే నిర్వహించారు. జాతీయ రహదారికి అవసరమైన మార్కింగ్‌ కూడా వేస్తున్నారు.

ప్లాట్ల యజమానుల్లో ఆందోళన 
వీవీపాలెం సమీపంలోని కొత్త కలెక్టరేట్‌ను ఆనుకుని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ మధ్యలో నుంచి జాతీయ రహదారి నిర్మాణం పేరుతో సర్వే చేస్తుండగా.. విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నుంచి అమరావతి వరకు జాతీయ రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారని, సుమారు 300 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం ఉంటుందని సర్వే బృందం చెబుతోంది. అయితే కలెక్టరేట్‌ నిర్మాణం పేరుతో గజం రూ.4వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న స్థలాల్లో రోడ్డు నిర్మాణం జరిగితే భారీగా నష్టం జరుగుతుందని రియల్‌ వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. కాగా.. విషయం తెలుసుకున్న కొందరు ప్లాట్ల యజమానులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్కడికి చేరుకుని సర్వే బృందాన్ని రోడ్డు నిర్మాణంపై ఆరా తీసినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top