రారండోయ్‌ వేడుక చూద్దాం!

Khairatabad Ganesh Shobha Yatra Start in Hyderabad - Sakshi

నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధం

రంగంలోకి జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇతర విభాగాలు  

ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గాల్లో భారీ క్రేన్లు ఏర్పాటు  

సందర్శకుల కోసం ప్రత్యేక బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు

30 లక్షల మంచినీటి ప్యాకెట్లు సిద్ధం చేసిన జలమండలి

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాయి. పోలీసులు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు. లక్షలాది మంది భక్తజనం వేడుకలకు తరలిరానున్న దృష్ట్యా అడుగడుగునా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌ చుట్టూ సుమారు 30 వేల మంది పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖలు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గంలో నిమజ్జన వేడుకలు ముగిసి, భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేవరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

అలాగే  నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు నడిచే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులతో పాటు, అదనపు సర్వీసులను దక్షిణమధ్య రైల్వే నడపనుంది. రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం జలమండలి 30 లక్షల మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయనుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లో, నగరంలోని ఇతర ప్రాంతాల్లో 27 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అలాగే 108 అంబులెన్సులను 15 సిద్ధంగా ఉంచారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి పరిస్థితినయినా అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. మరోవైపు గతేడాది నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన యాత్ర ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట లోగా ముగియనుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని 35 చెరువుల్లో నిమజ్జనం ఏర్పాట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 117 స్థిరమైన క్రేన్లు, మరో 96 మొబైల్‌ క్రేన్లను ఆయా ప్రాంతాల్లో ఉంచారు. 

పక్కాగా పారిశుధ్య నిర్వహణ
నిమజ్జనం సందర్భంగా పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ  ప్రత్యేక యాక్షన్‌ టీంలను రంగంలోకి దింపింది. రూ.16.86 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌  తెలిపారు. శోభాయాత్ర జరిగే 370 కిలోమీటర్ల మార్గంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఓ యాక్షన్‌ టీమ్‌ ఉంటుంది. ఈ బృందంలో ఓ శానిటరీ సూపర్‌వైజర్‌ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్‌ఎఫ్‌ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తారు. మొత్తం 178 గణేశ్‌ యాక్షన్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. పారిశుధ్య కార్యక్రమాలకు మొత్తం 481 మంది సూపర్‌వైజర్లు, 719 ఎస్‌ఎఫ్‌ఏలు, 8,597 కార్మికులు పనిచేస్తారు. ట్యాంక్‌బండ్‌తో పాటు, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మీరాలంట్యాంక్‌ తదితర అన్ని నిమజ్జన ప్రాంతాల వద్దా 27 ప్రత్యేక వైద్య శిబిరాలను, 92 మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

జీహెచ్‌ఎంసీ నిర్మించిన 20 గణేశ్‌ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీటిని నింపి సిద్ధంగా ఉంచారు.  
విద్యుత్‌ విభాగం రూ.94. 21 లక్షల వ్యయంతో 34,926 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్సాగర్‌ చుట్టూ 48 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను, సరూర్‌నగర్‌ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం నగరంలోని అన్ని నిమజ్జన ప్రాంతాల్లో  మొత్తం 101 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 75 జనరేటర్లను అందుబాటులో ఉంచారు.  
రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్‌ చేశారు.  
శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్‌ ప్రూఫ్‌  టెంట్‌లను వేశారు. 38 ఫైర్‌ ఇంజన్లను  మోహరించారు.  
సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్‌ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్లను అందుబాటులో ఉంచారు.  
ట్యాంక్బండ్, సరూర్‌నగర్‌ చెరువుల వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాలు మోహరించాయి.  
పర్యాటక శాఖ హుసేన్‌ సాగర్‌ చెరువులో 7 బోట్లను సిద్ధం చేసింది. మరో 4 హైస్పీడ్‌ బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. 10 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.  

ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు
ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 8 ఎంఎంటీఎస్‌ రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్‌–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

550 ప్రత్యేక బస్సులు
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకునేందుకు 550 బస్సులను అదనంగా తిప్పనున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, కాచిగూడ, కూకట్‌పల్లి, లింగంపల్లి, బాలానగర్, జీడిమెట్ల, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్‌ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి.  

నిఘా నీడలో నిమజ్జనం
గణేశ్‌ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు కమిషనరేట్లలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు డీజీపీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు. ముఖ్యంగా దాదాపు మూడువేలకు పైగా సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేసిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఉన్నతాధికారులు నిమజ్జనయాత్రను పరిశీలించనున్నారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు శోభాయాత్ర దృశ్యాలను 450 సీసీటీవీ కెమెరాలు బంధించనున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన 38 క్రేన్లకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డులో 90 సీసీటీవీ కెమెరాలు భక్తులు, గణనాథుల కదలికలను బంధించనున్నాయి. అలాగే నగరంలో గూగుల్‌ ద్వారా ట్రాఫిక్‌ అలర్ట్‌ను అందించనున్నారు. అలాగే ఏ సమయానికి ఏ విగ్రహం నిమజ్జనం చేస్తున్నారో కూడా పొందుపరచడంతో సమయనుగుణంగా నిమజ్జనం జరిగేలా పోలీసులు చూస్తున్నారు.    

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..
1.సౌత్‌ జోన్‌: కేశవగిరి, మొహబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల్‌చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్‌కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్,దారుల్‌షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్‌
2.ఈస్ట్‌ జోన్‌: చంచల్‌గూడ జైల్‌ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జ్, సాలార్జంగ్‌ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్‌ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌
3.వెస్ట్‌ జోన్‌: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్‌ చౌరస్తా, ఉస్మాన్‌ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్‌ ఐలాండ్, బర్తన్‌ బజార్, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌
4.సెంట్రల్‌ జోన్‌: చాపెల్‌ రోడ్‌ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్‌ సెంటర్, షాలిమార్‌ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్‌ రోడ్‌ ఎంట్రీ, హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చౌరస్తా, కంట్రోల్‌రూమ్‌ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్‌ ఆఫీస్‌‘వై’ జంక్షన్, బీఆర్‌కే భవన్, ఇక్బాల్‌ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్‌ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్‌ పార్కు, వైశ్రాయ్‌ హోటల్‌ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు
5.నార్త్‌జోన్‌: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్‌ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్‌ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్‌’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి.
మెట్రో రైల్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్‌నగర్‌ కమ్యూనిటీ హాల్, ఆర్‌ అండ్‌ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్‌ ఫుడ్‌ వరల్డ్, సత్యం థియేటర్‌ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్‌పేట మీదుగా పంపిస్తారు.   

ఎన్టీఆర్‌ మార్గ్‌లో భారీ క్రేన్లు
బంజారాహిల్స్‌: ఎన్టీఆర్‌ మార్గ్‌లో మొత్తం 12 క్రేన్లను అందుబాటులో ఉంచినట్టు ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారుఖి, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ సర్కిల్‌–17డీఎంసీ సత్యనారాయణ తెలిపారు. శనివారం వారు ఆ ప్రాంతంలో ఏర్పాట్లును పరిశీలించి మాట్లాడారు. ఒక్కో క్రేన్‌ దగ్గర ఒక ఏఈ, మూడు క్రేన్లకు కలిపి ఒక డీఈ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు ఏఎంహెచ్‌ఓలు, జోనల్‌ కమిషనర్, ఇద్దరు డీఎంసీలు 12 మంది అధికారులు విధుల్లో ఉంటారన్నారు. వీరుగాక ఒక్కో క్రేన్‌ వద్ద షిఫ్ట్‌కు 21 మంది చొప్పున ఎంటమాలజీ, శానిటేషన్‌ వర్కర్లు వ్యర్థాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ ప్లాస్టిక్‌ కవర్లు అందజేశారు. చెత్తను తరలించడానికి 15 టిప్పర్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. ఇక్కడ జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసింది. నాలుగు చోట్ల మొబైల్‌ టాయ్‌లెట్లు, రెండు షీ టాయ్‌లెట్లను అందుబాటులో ఉంచామన్నారు. కాగా, శుక్రవారం ఒక్క రోజే 140 మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలించినట్టు అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top