జైపాల్‌రెడ్డి మృతి.. ప్రముఖుల నివాళి

KCR Tributes To Congress Senior Leader S Jaipal Reddy - Sakshi

సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి : కోమటిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి(77) మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం..
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి మృతితో గొప్ప నాయకున్ని కోల్పోయామని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు. ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ కూడా జైపాల్‌రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

జైపాల్‌రెడ్డితో 25ఏళ్లుగా అనుబంధం
జైపాల్‌రెడ్డితో తనకు 25ఏళ్లుగా అనుబంధం ఉందని వైఎస్‌ఆర్‌సీపీ నరసాపురం ఎంపీ  రఘురామ కృష్ణంరాజు అన్నారు. జైపాల్‌రెడ్డి.. ప్రజాప్రతినిధులకు ఆదర్శనీయమన్నారు. ఆయన రాస్తున్న జీవితచరిత్ర పుస్తకాన్ని కూడా రిలీజ్‌ చేయాలని కోరారు. జైపాల్‌రెడ్డి లేకపోవడం చాలా బాధాకరమని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

(కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత)

ప్రభుత్వమే అంత్యక్రియలు జరపాలి..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జైపాల్‌రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయన పార్థవ దేహన్ని సందర్శించడానికి వస్తారని తెలిపారు. అంత్యక్రియలకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని, మహాప్రస్థానం ప్రాంతం ఎక్కువ మందికి సరిపోదని అభిప్రాయపడ్డారు. ‘ఆయన పార్లమెంటులో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయేవారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వాడే పదాలు, భాష గొప్పగా ఉండేది. ఆయన మరణం కాంగ్రెస్‌పార్టీకే కాదు. రాజకీయాలకే తీరని లోటు . జైపాల్‌రెడ్డి నాకు తండ్రిలాంటి వారు’ అన్నారు.

వ్యక్తిగతంగా తీరని లోటు..
జైపాల్‌రెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోశించారని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ శోక సముద్రంలోమునిగిపోయిందని చెప్పారు. తనతో జైపాల్‌రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేవారని.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు.  వ్యక్తిగతంగా ఆయన మృతి తనకు తీరని లోటని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జైపాల్‌రెడ్డినీతికి నిజాయితీకి మారుపేరైన వ్యక్తి. రాజకీయ నాయకుల్లో అలాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు’ అన్నారు.

నివాళులర్పించిన ప్రముఖులు..
జైపాల్‌రెడ్డి మృతిపట్ల విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, వినోద్‌ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సంతాపం తెలియజేశారు. జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీ హనుమంతారావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి జైపాల్‌రెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఉత్తమ పార్లమెంటేరియన్, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

రాజకీయ నాయకుడే కాదు.. తాత్విక మేధావి
జైపాల్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయం అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి తొలి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు తీసుకుని పాలమూరు జిల్లాకు పేరు తెచ్చారని కొనియాడారు. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు చాలా నిబద్దతతో ప్రజాస్వామ్యస్ఫూర్తికి ప్రతిరూపంగా ఉండేవని గుర్తు చేశారు. చాలా హుందాగా చర్చల్లో పాల్గొనేవారని, జైపాల్‌రెడ్డి రాజకీయ నాయకుడే కాదు తాత్విక మేధావి అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top