సీఎం ఆలోచనలు ఆకాశంలో : చాడ

సీఎం ఆలోచనలు ఆకాశంలో : చాడ - Sakshi


హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేల విడిచి సాము చేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం ఆలోచనలు ఆకాశంలో విహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు 7,8 స్థానాలు కూడా రావని ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచి, ప్రతిపక్షాలను కించపరిచారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పాలన తీరుతో బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. గురువారం పార్టీ నాయకుడు అజీజ్‌పాషాతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయ-వ్యయాలు, బడ్జెట్ వ్యయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలి బూటులో రాయి తీయలేని వారు ఏట్లో రాయి తీస్తారా అని ప్రశ్నించారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, బడ్జెట్ ఫ్రీజింగ్‌తో బడుగు, బలహీనవర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు నిలిచిపోయిందన్నారు. అర్థరాత్రి నోటిఫికేషన్‌లతో ఆగమేఘాలపై కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. ఆగస్టు 20న నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సీఎం ఇచ్చిన అజెండాలో 27 జిల్లాలు, కొత్తగా 9 రెవెన్యూ మండలాలు, 29 రెవెన్యూ మండలాలను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే చివరకు 31 జిల్లాలతో పాటు కొత్తగా 25 రెవెన్యూ మండలాలు, 125 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.



కొత్తగా కలిపిన 4 జిల్లాలకు సంబంధించి గతం నుంచి ప్రజా ఆందోళనలు, డిమాండ్ ఉన్నా పట్టించుకోలేదని, మళ్లీ వాటినే ఎలా పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటు బ్రహ్మాండంగా ఉందని మిమ్మల్ని మీరే అభినందించుకుంటే దానిని అంగీకరించేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడంతో పాటు ప్రతిపక్షాలకు ఇచ్చిన మాటను కూడా సీఎం నిలబెట్టుకోలేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top