మనసా, వాచా, కర్మేణా..  బంగారు తెలంగాణకు పునరంకితం 

KCR Present Telangana Budget - Sakshi

సాగు, సంక్షేమ తెలంగాణే లక్ష్యంగా..

రూ.1,82,017 కోట్లతో వార్షిక పద్దు 

ఆర్థిక ప్రగతితో రాష్ట్రం దూసుకుపోతున్న తీరును ప్రతిబింబించిన బడ్జెట్‌ 

ప్రాజెక్టులు, పింఛన్లు, రైతుబంధు, రుణమాఫీలకు పెద్దపీట

 సాగునీటి వసతుల మెరుగుకే ఎక్కువ కేటాయింపులు 

సబ్‌ప్లాన్‌ల అమలుతో ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగుకు యత్నం 

తలసరి ఆదాయం రూ.25వేలు పెరుగుతుందని అంచనా

శాసనసభలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రస్ఫుటంగా ప్రతిబింబించింది. ఆసరా పింఛన్లు మొదలుకుని రైతు రుణమాఫీ దాకా ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్న ప్రతిన తాత్కాలిక బడ్జెట్‌లో కనిపించింది. రైతన్న కోసం సాగుకు వెన్ను దన్ను, ఆపన్నుల కోసం పింఛన్లు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కొంత నిరాశ కలిగించినా, ఇతర సంక్షేమ పథకాల విషయంలో సీఎం ఉదారంగా వ్యవహరించారు. అయితే, ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతున్న తీరును బడ్జెట్‌ ఆవిష్కరించింది. గడిచిన రెండేళ్ల రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ వృద్ధిరేటు సాధించిన తీరు.. రాష్ట్ర భవిష్యత్‌ మరింత ఆశాజనకంగా ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది జీఎస్‌డీపీ రూ.8,66,875 కోట్ల మేర ఉంటుందని సీఎం బడ్జెట్‌ ప్రసంగంలో అంచనా వేశారు. 2017–18లో రూ.1,81,102గా ఉన్న తలసరి ఆదాయం ఈ ఏడాది రూ.2,06,107కు చేరుకోనుందని అంచనా వేశారు. వృద్ధాప్యంలో ఉన్న పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు రూ.1,450 కోట్లు కేటాయించారు. నిరుద్యోగ భృతి కోసం రూ.1,810 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్‌ చట్టాన్ని అమలు చేసి తీరుతామన్న సంకేతాలిచ్చారు. సాగుకు పండగేనన్న రీతిలో సీఎం ప్రతిపాదనలుఉన్నాయి. ‘రైతు బంధు’ కింద ఎకరానికి రూ.2 వేలు పెంచుతూ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు ప్రతిపాదించారు. రూ.లక్ష లోపు పంట రుణమాఫీకి మొదటి విడతలో రూ.6వేల కోట్లు కేటాయించారు. వడ్డీ సహా ఈ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమాకు రూ.650 కోట్లు కేటాయించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం మేరకు బడ్జెట్‌లో రూ.22,500 కోట్లు ప్రతిపాదించారు. 

మనం అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో దేశమంతా గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు దేశమంతా తెలంగాణవైపు చూస్తోంది. దీంతో హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. మేనిఫెస్టోలోని కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. చెప్పనివి ఎన్నో అమలుచేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ లేదనడం అతిశయోక్తి కాదు.      – కేసీఆర్‌

శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 

మనసా, వాచా, కర్మేణా..  బంగారు తెలంగాణకు పునరంకితం 
ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా బడ్జెట్‌ రూపకల్పన 
బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా.. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మేణా పునరంకితమవుతామని ఆయన ప్రకటించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గానూ శుక్రవారం ఆయన శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్‌ ప్రతిపాదిత వ్యయం రూ.1,82,017 కోట్లుగా పేర్కొన్న సీఎం అందులో ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు, నిర్వహణ పద్దు వ్యయం 74,715 కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 

దేశానికే ఆదర్శంగా.. 
29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా, అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్వల్ప కాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి, సామాజిక, ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవడం అద్భుతం. రాష్ట్రం ఆవిర్భవించినపుడు ఎటుచేసినా వెనుకబాటుతనమే కనిపించింది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్యపాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరత, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఎక్కడికక్కడే ఆగిపోయిన నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరుస కరువులు, వలసపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం అలమటించే దౌర్భాగ్యంతో తెలంగాణ సామాజిక ముఖచిత్రం ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నించాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడి దీవెనలు, ప్రకృతి అనుకూలతలు, ప్రజల సహకారం లభించాయి. మొదటి నాలుగున్నరేళ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పంథాలో సాగి అద్భుత విజయాలు సాధించాం. అతితక్కువ సమయంలోనే అభివృద్ధి దిశగా అడుగులేశాం. వినూత్నమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది. శక్తిసామర్థ్యాలను ఇనుమడింపచేస్తుంది .

రెండు రెట్ల కన్నా ఎక్కువ జీఎస్డీపీ వృద్ధి 
సమైక్యపాలన చివరి రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు దేశసగటు కన్నా తక్కువ ఉండేది. ఆ రెండేళ్లలో దేశసగటు వృద్ధిరేటు 5.9% ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 4.2% మాత్రమే. అదే 2018–19లో వృద్ధిరేటు రెండురెట్ల కన్నా ఎక్కువగా 10.6% నమోదైంది. ప్రస్తుత ధరలలో జీఎస్డీపీ 2016–17లో 14.2% ఉంటే 2017–18లో 14.3%కు పెరిగింది. 2018–19లో 15% వృద్ధి సాధించనుంది. ఇది దేశ అభివృద్ధి రేటు 12.3% కన్నా ఎక్కువ. 2018–19లో జీఎస్డీపీ ప్రాథమిక రంగం 10.9% వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. విద్యుత్‌ పరిస్థితిలో మెరుగుదల, సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి మద్దతు ద్వారా ఇది సాధ్యపడింది. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లోనూ చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ఈ రంగాల్లో 14.9% వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సేవారంగంలో 15.5% పెరుగుదల నమోదవుతుందని ఆశిస్తున్నాం. ఇక, తలసరిఆదాయం 2017–18లో రూ.1,81,102 ఉంటే 2018–19లో రూ.2,06,107కు చేరుకోనుంది. 

బాల్యవివాహాలు తగ్గాయ్‌ 
పేద తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కార్యక్రమాలను చేపట్టాం. ఈ పథకం పేదలకు ఆర్థిక అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదపడింది. 18ఏళ్లు నిండిన వారే అర్హులనే నిబంధనతో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు రూ.1,450 కోట్లు కేటాయిస్తున్నాం. నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.1,810 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్‌ కులాల ప్రగతినిధికి రూ.16,851 కోట్లు, షెడ్యూల్‌ తెగల ప్రగతి నిధికి రూ.9,827 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం 2,004 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

నేను దగ్గరుండి గమనించాను 
నా విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నాను. బీడీలు చుట్టే తల్లులు అనుభవించే దుర్భర వేదనను దగ్గర్నుంచి గమనించాను. అందుకే వారి వేదనను తీర్చాలని ఎవరూ అడగకుండానే ప్రతినెలా రూ.1,000 జీవనభృతిని ప్రకటించాను. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాట్లు చెప్పనలవికాదు. వీరికి రూ.1,000 భృతి ఇవ్వడం కొండంత అండగా మారింది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారంతా కేసీఆర్‌ మమ్మల్ని కాపాడుతున్న పెద్దకొడుకని, దేవుడిచ్చిన అన్న అని దీవించడం.. నా రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇదే నా హృదయానికి దగ్గరైన కార్యక్రమాలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛన్‌ను నెలకు రూ.1,000 నుంచి రూ.2016కు పెంచుతున్నాం. దివ్యాంగుల పింఛన్‌ను రూ.3,016కు పెంచుతున్నాం. వృద్ధాప్య పింఛన్‌ కనీస వయసును 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నాం. ఆసరా పింఛన్ల కోసం 12,067 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నాం. రేషన్‌తో పాటు హాస్టళ్లు, మధ్యాహ్న భోజనంలో ఇచ్చే సన్నబియ్యం సబ్సిడీ కోసం రూ.2,744 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

తెలంగాణపైనే చర్చ
మనం అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్రబిందువుగా మారింది. గతంలో దేశమంతా గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్‌పైనే చర్చ జరుగుతోంది. దీంతో హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. మేనిఫెస్టోలోని కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. చెప్పని ఎన్నో కార్యక్రమాలను అమలుచేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వంపై తమకున్న అచంచల విశ్వాసాన్ని చాటుకున్నారు.  

విద్యుత్‌ సంక్షోభం పరిష్కారం 
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదో నెల నుంచే నాణ్యమైన విద్యుత్‌ను 24గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు 28వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భద్రాద్రి పవర్‌ప్లాంటు ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తుంది. యాదాద్రి అల్ట్రామెగా పవర్‌ప్లాంటు నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. 5వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని 3,613 మెగావాట్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు 16,503 మెగావాట్లకు చేర్చాం. మిషన్‌భగీరథ ద్వారా రాష్ట్రంలోని 19,750 జనావాసాల్లో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీరిస్తున్నాం. ఏప్రిల్‌ నెలాఖరు కల్లా వందకు 100% పూర్తి చేసి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీళ్లిస్తాం. ఇప్పటివరకు 2,72,763 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశాం. కొత్తగా 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించాం. హైదరాబాద్‌ ఔటర్‌రింగురోడ్డు అవతల 340 కిలోమీటర్ల రీజనల్‌ రింగురోడ్డును నిర్మించాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామపంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. 

ఎన్నికల హామీలకు కట్టుబడి.. 
వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. మేం ప్రవేశపెట్టిన పథకాలను యావత్భారతం వేనోళ్ల కొనియాడుతోంది. పండిన పంటకు మద్దతు ధరను సాధించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రైతుల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పబోతున్నాం. 2014 ఎన్నికల హామీకి కట్టుబడి 35.29లక్షల రైతుల రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి 4.17లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదామును 22.50లక్షల టన్నుల సామర్థ్యానికి తెచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి 2018 డిసెంబర్‌11 నాటికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రైతురుణమాఫీ కోసం రూ.6వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం గర్వకారణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు సాయాన్ని పెంచుతున్నాం. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతుబీమాతో ఇప్పటివరకు 5,675 మంది రైతు కుటుంబాలకు రూ.283 కోట్ల సాయం అందించాం. ఈ బడ్జెట్‌లో రైతుబీమా కిస్తీ కోసం రూ.650 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఆ రికార్డులు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలుగా కోర్‌బ్యాంకింగ్‌ తరహాలో ధరణి వెబ్‌సైట్‌ రూపొందించాం. క్రాప్‌కాలనీల్లో భాగంగా చిన్న, మధ్యతరహా, భారీ ఆహార శుద్ధి కేంద్రాలు నెలకొల్పుతాం. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని సంకల్పిస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20,107 కోట్లను వ్యవసాయశాఖకు ప్రతిపాదిస్తున్నాం.
 
నాలుగేళ్లలో 90% పూర్తి 
గతంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టేది. కానీ మేం నాలుగేళ్లలోనే 90% నిర్మాణపనులను పూర్తి చేశాం. అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలనాల అనుమతులొచ్చాయి. తెలంగాణ వరదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కేంద్ర జలసంఘం, కేంద్ర ఆర్థిక సంఘం కొనియాడాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు నీరందివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను ఈ ఐదేళ్లకాలంలో పూర్తిచేసి సస్యశ్యామలం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక 
సమైక్య పాలనలో తెలంగాణ సామాజిక జీవిక చెదిరిపోయింది. ఈ పరిస్థితిలో మార్పు కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. గొర్రెల పంపిణీ ద్వారా కురుమగొల్లలకు రూ.2,600 కోట్ల సంపద సమకూరింది. పెద్దసంఖ్యలో ఉన్న పవర్‌లూమ్‌లను ఆధునీకరిస్తున్నాం. వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌పార్కు, సిరిసిల్లలో అపరెల్‌ పార్కు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సంచార జాతులను ఆదుకునేందుకు ఈ బడ్జెట్‌లో ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు 
నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, మౌలికసదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు సాధ్యమని నమ్ముతున్నాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఆసుపత్రి సేవలను మెరుగుపరిచాం. మందుల కోనుగోలుకు ఏటా రూ.440 కోట్లు వెచ్చిస్తున్నాం. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూ కేంద్రాల సంఖ్య పెంచాం. ప్రతి 10వేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. కేసీఆర్‌ కిట్స్‌తో ఆసుపత్రుల్లో ప్రసవాలు 33 నుంచి 49%కు పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశుమరణాల రేటు ప్రతి వెయ్యి మందికి 39 ఉంటే అది ఇప్పుడు 28కి తగ్గింది. మాతృత్వ మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది. కోటి 52లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కంటి అద్దాలిచ్చాం. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్యశాఖకు రూ.5,536 కోట్లు ప్రతిపాదిస్తున్నాం .

విప్లవాత్మక సంస్కరణలు 
ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు జిల్లాలను 33కి, రెవెన్యూ డివిజన్లను 69కి, మండలాలను 584కు పెంచుకున్నాం. కొత్తగా 68 మున్సిపాలిటీలు, 4,383 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా 7 పోలీస్‌ కమిషనరేట్లు, 44 సబ్‌డివిజన్లు, 29 సర్కిళ్లు, 102 పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 1,177 తండాలను పంచాయతీలుగా మార్చాం. గ్రామాభ్యుదయం కోసం నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి రూపకల్పన చేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,400 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.9,000 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గ్రామాల అభివృద్ధికి ఎక్కువ నిధులివ్వాలన్న ఆలోచనతో కేంద్ర ఆర్థిక సంఘం ఇస్తున్న రూ.1,628 కోట్లకు అదనంగా మేం మరో రూ.1,628 కోట్లు గ్రామాలకు ఇస్తాం. దీంతో 500 జనాభా ఉన్న గ్రామానికి కూడా 8లక్షల వరకు నిధులొస్తాయి. ఇప్పటివరకు రూ.1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులివ్వడంతో 8.58లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం కానుంది.
 
రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు 
అకౌంటెంట్‌ జనరల్‌ ధ్రువీకరించిన ప్రకారం 2017–18లో మొత్తం వ్యయం రూ.1,43,133 కోట్లు. రెవెన్యూ రాబడులు రూ.88.824 కోట్లు. రెవెన్యూ ఖర్చు 85,365 కోట్లు. మిగులు రూ.3,459 కోట్లు. మొత్తం వ్యయంలో మూలధన వ్యయం రూ.23,902 కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం 2018–19 సంవత్సరానికి అంచనా వ్యయం రూ.1,61,857 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,19,027 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.28,053 కోట్లు. రెవెన్యూ ఖాతాలో మిగులు రూ.353 కోట్లు. ఇక, 2019–20 సంవత్సరానికి రెవెన్యూ రాబడుల ప్రతిపాదనలు రూ.94,776 కోట్లు. కేంద్ర ప్రతిపాదిత బదిలీలు రూ.22,835 కోట్లు. ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు. నిర్వహణ పద్దు అంచనా వ్యయం రూ.74,715 కోట్లు. మొత్తం ప్రతిపాదిత వ్యయం రూ.1,82,107 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు. మిగులు రూ.6,564 కోట్లు. ఆర్థికలోటు రూ.27,749 కోట్లు. అంచనావేసిన జీఎస్డీపీలో ఇది 2.81%.

సుస్థిరమైన వృద్ధి 
మరే రాష్ట్రానికి సాధ్యంకాని రీతిలో రాష్ట్రం స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటు సాధిస్తోంది. మొదటి నాలుగేళ్లలో 17.17% వార్షిక సగటువృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. మూలధన వ్యయశాతంలోనూ దేశంలోనే మనమే మొదటి స్థానంలో ఉన్నాం. 2016–17 సంవత్సరంలో మొత్తం వ్యయంలో మూలధన వ్యయం 28.2% ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి పదేళ్లలో మూలధన వ్యయం రూ.1,29,683 కోట్లయితే 10 జిల్లాలకు చేసిన వ్యయం రూ.54,052 కోట్ల రూపాయలే. కానీ, నాలుగున్నరేళ్లలో తెలంగాణలో రూ.1,68,913 కోట్ల మూలధన వ్యయం జరిగింది. 

కొత్త పథకాలు ప్రారంభం 
‘రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తదేక దీక్షతో తపస్సు చేయడం వల్లే ప్రజలు గత ఎన్నికల్లో నిండు దీవెనలు అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా వినూత్న పథకాలతో ముందుకెళతాం. పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధి ఫలాలు అందుకునేలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను’అని కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రతిపాదనలు సభముందుంచారు.   

కొత్త పథకాలు ప్రారంభం 
‘రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తదేక దీక్షతో తపస్సు చేయడం వల్లే ప్రజలు గత ఎన్నికల్లో నిండు దీవెనలు అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా వినూత్న పథకాలతో ముందుకెళతాం. పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధి ఫలాలు అందుకునేలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను’అని కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రతిపాదనలు సభముందుంచారు.

►రూ.1,07,302 కోట్లు  2019–20కి ప్రగతి పద్దు
►రూ.74,715 కోట్లు నిర్వహణ పద్దుకు కేటాయించింది 
►రూ.6,564 కోట్లు రెవెన్యూ మిగులు
►రూ.27,749 కోట్లు ద్రవ్యలోటు
►రూ.1,74,453 కోట్లు 2018–19 ఆమోదించిన బడ్జెట్‌
►రూ.1,61,857 కోట్లు సవరించిన అంచనా బడ్జెట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top