మీ ఊళ్లోనే కొనుగోళ్లు

KCR Guaranteed Farmers To Buy Crops At Reasonable Price - Sakshi

ప్రతి ధాన్యం గింజా ప్రభుత్వమే కొంటది 

రైతులెవరూ ఆందోళన చెందొద్దు

ఏప్రిల్‌ మొత్తం కొనుగోళ్లు చేస్తం... ఖాతాల్లో చెక్కులు వేస్తామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : ‘గతంలో ఎప్పుడో ఓల్డ్‌ సిటీలో కర్ఫ్యూ చూసినం. యావత్‌ దేశమే ఈ రోజు కర్ఫ్యూలో ఉంది. రైలు, విమానం, ట్యాక్సీ లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ఆందోళనకు గురికావద్దు. మీరు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తనకు కూడా 20 ఎకరాల పంట ఉందని, కోసి అమ్ముకోవాలని తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పంట దిగుబడుల కొనుగోళ్లకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన ప్రగతి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘54లక్షల ఎకరాల్లో పంట ఉంది. పండ్లు, కూరగాయలు అన్నీ కలిపితే లక్షా 20 వేల ఎకరాలుంటయి. 54 లక్షల ఎకరాల్లో పంటల నూర్పిడి జరగాలి. మన దగ్గర అవసరమైన హార్వెస్టర్లున్నాయి.

రైతులు ఆందోళన పడకుండా పంటలు అమ్ముకోవాలి. పట్టణాల్లోని వ్యవసాయ మార్కెట్లకు రానియ్యరు. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది గ్రామాల్లోనే ఉంటరు. నేటి నుంచి జిల్లా కలెక్టర్లు దీనిపైనే దృష్టిపెడతరు. ఏప్రిల్‌ మొత్తం ధాన్యం కొంటరు. ఊళ్లకే హమాలీవాళ్లు వచ్చి బస్తాలు, కాంటాలు తెస్తరు. డీసీఎంలు, లారీలు చేరుస్తరు. రైతుబంధు సమితిలు ప్రతి ఊరిలో మీ ఊరికి కథానాయకులు కావాలి. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా రైతులకు అవగాహన కల్పించాలి. మక్కలు, వరి ధాన్యం, ఇతర పంటలను ప్రభుత్వమే కొంటది. వారి ఖాతాల్లో చెక్కులు వేస్తది.

పంట తెచ్చేటప్పుడు పాస్‌బుక్‌ కాపీ, ఖాతా నంబర్‌ తేండి. మీకు నెల రోజుల్లో డబ్బులు విడుదలవుతాయి. గత్తర బిత్తర కావాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోళ్లకు మాకు రూ.35వేల కోట్లు కావాలి. ఆర్‌బీఐతో మాట్లాడుతున్నం. కరోనా వ్యాప్తి చెందకుండా ఊళ్లకు కంచెలు వేసుకోవడం ఒక విధంగా మంచిది అయితే మరో విధంగా సమస్యగా మారింది. గ్రామానికి ధాన్యం కొనుగోలు చేసేందుకు హమాలీలు, సిబ్బంది రావాలి.. అంబులెన్సులు రావాలి.. కాబట్టి కంచెను కొంత వరకు తొలగించండి’అని సీఎం కోరారు.  

ఏప్రిల్‌ 10 వరకు సాగునీరు, కరెంట్‌ 
‘50లక్షల పైచిలుకు ఎకరాల్లో పంటలు నోరు తెరుచుకుని రెడీగా ఉన్నయి. ఆ పంటల నూర్పిడి జరిగితేనే మన నోటికి అన్నం అందుతది. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల, కల్వకుర్తి కింద ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో ఏప్రిల్‌ 10 వరకు నీళ్లు ఇవ్వాలని ఆదేశించాం. ఒక ఎకరం పంట కూడా ఎండొద్దు. ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలోనైనా సరే చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలి. బోరు బావులకు ఏప్రిల్‌ 10 వరకు కరెంట్‌ అందించాలి. పంటలకు నిరంతర విద్యుత్‌ ఇచ్చి కాపాడాలని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వారి సిబ్బందిని కోరినందుకు ధన్యవాదాలు. మరో 15 రోజులు పంటలకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. ఆ తర్వాత విద్యుత్‌ లోడ్‌ రెండు మూడువేల మెగావాట్లు తగ్గిపోయి ఒత్తిడి తగ్గుతుంది. విద్యుత్‌ సిబ్బంది సేవనందిస్తున్నారు’అని సీఎం ప్రశంసించారు. 

పాఠశాలల్లోనూ ధాన్యం నిల్వ.. 
‘38 లక్షల ఎకరాల్లో ధాన్యం వస్తున్నది. చరిత్రలో తొలిసారిగా. వ్యవసాయ, మార్కెటింగ్, వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్ల గోదాముల్లో పెడ్తరు. 24లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్త గోదాములు కట్టుకున్నం. అవన్నీ సరిపోకపోతే గ్రామాల్లోని ప్రాథమిక, జిల్లా పరిషత్, జూనియర్‌ కళాశాలలను తాత్కాలికంగా గోదాములుగా వాడుకుంటాం. వ్యాపారులు కొంటామంటే తప్పనిసరిగా కనీస మద్దతు ధర చెల్లించాలి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై దిశానిర్దేశం చేస్తా’అని కేసీఆర్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top