పునర్విభజన తర్వాతే! | KCR given clarification about formation of new districts | Sakshi
Sakshi News home page

పునర్విభజన తర్వాతే!

Sep 13 2014 12:36 AM | Updated on Aug 15 2018 9:22 PM

సూర్యాపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న అంశం ఊరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట బహిరంగసభలో ‘జగదీష్‌రెడ్డిని మీరు గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతా’ అని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ మాట నిలబె ట్టుకున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చిన సీఎం కేసీఆర్

సాక్షిప్రతినిధి, నల్లగొండ : సూర్యాపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న అంశం ఊరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట బహిరంగసభలో ‘జగదీష్‌రెడ్డిని మీరు గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతా’ అని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ మాట నిలబె ట్టుకున్నారు. సూర్యాపేటను ప్రత్యేక జిల్లాగా మారుస్తానన్న హామీ కూడా ఇచ్చిన ఆయన ఆ మేరకు ప్రక్రియ మొదలుపెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వివరాలు అందించాలని రెవెన్యూ శాఖను సీఎం కోరారని వెలువడిన వార్తల నేపథ్యంలో,  కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్వత్రా చర్చజరిగింది.
 
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ నేతలు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వం వద్ద బ్లూప్రింట్ కూడా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. పార్టీ అంచనాకు తోడు, అధికారిక సమాచారంతో సాధ్యాసాధ్యాలు, సాధకబాధకాలు చూసుకుని కానీ ముందడుగు వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని  శుక్రవారం సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో కొంత గందరగోళం తొలగిపోయింది.
 
రెవెన్యూ డివిజన్ పరిధి ఎలా...?
ఇక, రెవిన్యూ డివిజన్ల పరిధిని పరిశీలించినా,  కొంత గందరగోళమే కనిపిస్తున్నది.  నాగార్జునసాగర్ నియోజకర్గ పరిధిలోని గుర్రంపోడు మండలం దేవరకొండ డివిజన్‌లో, మిగిలిన నాలుగు మండలాలు  మిర్యాలగూడ  డివిజన్‌లో ఉన్నాయి. నల్లగొండ డివిజన్ పరిధిలోని కొన్ని మండలాలు  కొత్తగా ఏర్పాటు కాబోయే సూర్యాపేట జిల్లా పరిధిలోకి మార్చాలన్న అభిప్రాయం ఉంది. రెవెన్యూ డివిజన్ల మేరకు చూసినా, ఏకరూపం వచ్చేలా లేదు. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను కూడా పెంచాలన్న ప్రతిపాదన ముందునుంచీ ఉంది. ఒకవేళ  కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటు వ్యవహారం ఓ కొలిక్కివస్తే.. ఆ నియోజకవర్గాలు ఏ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వెళతాయన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే.
 
ఏరకంగా చూసినా, సూర్యాపేట కొత్త జిల్లా ఏర్పాటు అనేక సందేహాలు, శషబిషలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా విభజనను అంతా ఆహ్వానిస్తున్నా, తమ సందేహాలకు సరైన సమాధానం చెప్పే వారు మాత్రం లేరన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే భూముల ధరలు పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా ఏర్పాటు వార్తలు ఇదే తరహాలో వెలువడితే, సామాన్యులు ఎవరూ ఈ ప్రాంతంలో కనీసం ఇంటిజాగా కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని ఓ రెవెన్యూ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.
 
 ఇవీ.. సందేహాలు
* ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తోంది.  కానీ, ఇదంత సులభం కాదని పరిశీలకులు భావిస్తున్నారు.
* సూర్యాపేటను జిల్లాగా మార్చాలంటే ముందుగా పార్లమెంటు నియోజకవ ర్గాల స్వరూపాలే మారిపోవాలి. జిల్లాకేంద్రంగా ఏర్పాటు కావాల్సిన సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది.
* సూర్యాపేట జిల్లాలో కలపాలనుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా  భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
* భువనగిరి పార్లమెంటు నియోజకవర్గపరిధిలోనే వరంగల్ జిల్లాకు చెందిన జనగామ, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది.  
* మరోవైపు మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంటును కూడా సూర్యాపేట జిల్లాలో చేర్చే వీలుందని ప్రచారం జరిగింది. ఈ నియోజకవర్గం సైతం నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఇన్ని సెగ్మెంట్లను అటుఇటు మార్చి పూర్తిగా ఒక పార్లమెంటు నియోజకవర్గ స్వరూపాన్ని మార్చడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశమని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement