కేసీఆర్‌ వస్తున్నారు..

Kcr Election Meeting At Mahabubnagar - Sakshi

 లోక్‌సభ అభ్యర్థుల తరఫున ప్రచారం

 ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు 

 ముఖ్యమంత్రి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి  

సాక్ష, మహబూబ్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధుల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సారు.. కారు.. పదహారు నినాదంతో లోక్‌సభ ఎన్నికల పోరుకు సమాయత్తమవుతోన్న గులాబీ పార్టీ ఆ మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో పదహారు లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేందుకు గులాబీ అధినేత  కేసీఆర్‌ అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలోని వనపర్తి  జిల్లాకేంద్రానికి సమీపంలో నాగవరంలో.. మహబూబ్‌నగర్‌ లోక్‌సభకు సంబంధించి భూత్పూర్‌లో జరగనున్న సభలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి లక్ష మంది చొప్పున జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు ఇప్పటికే తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అన్ని అసెంబ్లీ స్థానాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో జనాన్ని భారీగా సమీకరించారు. సీఎం కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4గంటల ప్రాంతంలో వనపర్తి సభకు చేరుకుంటారు.

అక్కడ ఖిల్లాఘనపురం,  పెద్దమందడి, పెబ్బేరు మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు రెండొందల మంది కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అనంతరం కేసీఆర్‌ గంట సేపు ప్రసంగిస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా 6గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. ఇక్కడ గంటసేపు ప్రసంగించి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. సీఎం సభ జరిగే రెండు చోట్లా జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించింది.  

సీఎం ప్రసంగంపై ఆసక్తి.. 
ఈ నెల 29న మహబూబ్‌నగర్‌ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించుకున్నారని... తర్వాత సీఎంను చేశారన్నారు. అయినా.. కేసీఆర్‌ మాత్రం ఈ ప్రాంత ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. అలాగే ఇటీవల టీఆర్‌ఎస్‌ను వీడి కమలం గూటికి చేరిన మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి.. బీజేపీ బహిరంగసభలో కేసీఆర్‌ను విమర్శించారు.

ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సైతం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. దీంతో ఆదివారం బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌.. మోదీ, జితేందర్‌రెడ్డి, అరుణపై ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారో అనేది హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో తాత్సార్యం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.  

సంక్షేమమే ఎజెండా... 
ఐదేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన ఏజెండాగా బరిలో దిగిన గులాబీ పార్టీ వీటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. ప్రస్తుతం రెండు పార్లమెంట్‌ పరిధుల్లో 14అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండడం.. పార్లమెంట్‌కు ఒకరి చొప్పున వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవులు అప్పగించడం రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల విజయానికి కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు రెండు స్థానాల్లోనూ త్రిముఖ పోటీ నెలకొనడం.. మహబూబ్‌నగర్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వనుండడంతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ అదే వేదికపై స్థానిక నేతలు, ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top