కొండూర్‌ శశాంక బదిలీ

Karimnagar Municipal Corporation Commissioner Transfer - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌:రీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ కొండూర్‌ శశాంక బదిలీ అయ్యారు. బుధవారం ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల్లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఇరవై నెలల పాటు ఇక్కడ సేవలందించిన శశాంక తన సహ జ స్వభావంతో ఐఏఎస్‌ మార్కు చూపారు. 2016 డిసెంబర్‌ 8న నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరపాలక సంస్థను అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేశారు. ముఖ్యంగా స్మార్ట్‌సిటీ సాధనలో కీలక పాత్ర పోషించారు. స్మార్ట్‌సిటీ రేసులో ఉన్నప్పుడు అధికారులను, పాలకులను, ప్రజలను పరుగులు పెట్టించారు. ఢిల్లీ స్థాయిలో స్మార్ట్‌సిటీ హోదా కోసం నిరంతరం శ్రమించారు.

స్మార్ట్‌సిటీ పొందిన నగరాలను సందర్శిస్తూ ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ డిటేల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సమర్పించడంలో సఫలీకృతులయ్యారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌ రవీందర్‌సింగ్‌ నేతృత్వంలో 2017 జూన్‌ 23న స్మార్ట్‌సిటీ హోదాను సాధించడంలో కీలక భూమిక పోషించారు. స్మార్ట్‌సిటీ హోదాను దక్కించుకోవడంలో ప్రణాళికాబద్ధంగా సమయస్ఫూర్తితో ముందుకెళ్లడంలో శశాంక చేసిన కృషిని ప్రజాప్రతినిధులు సైతం ప్రశంసించారు. ఐఏఎస్‌ అధికారిగా ఎవరూ పనిచేయనంత కాలం ఇక్కడి పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్నారు. 

స్వచ్ఛ సర్వేక్షణ్‌–2018లో..
దేశవాప్తంగా 4 వేల పైచిలుకు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనగా, కరీంనగర్‌ మెరుగైన ర్యాంకు సాధించడంలో శశాంక కీలక పాత్ర పోషించారు. కరీంనగర్‌లో శానిటేషన్‌ వ్యవస ్థను మెరుగపరచడంలోనూ, ఇంటింటి చెత్త సేకరణ, డంప్‌యార్డుకు చెత్తను తరలించడం, వీ ధుల్లో చెత్త కనిపించకుండా చేయడం, ఓడీఎఫ్‌ సాధించడంలో, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం, వాటి నిర్వహణలో మెరుగైన సేవలందించడంతో దేశంలో 73వ ర్యాంకు సాధించాం. అప్పటికే స్మార్ట్‌సిటీ సాధించుకున్న నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ ర్యాంకు రావడంతో దేశం చూపు ఒక్కసారిగా కరీంనగర్‌పై పడింది.
 
జీవన ప్రమాణాల్లో 11వ ర్యాంకు..
జీవన ప్రమాణాల అంశంపై దేశవ్యాప్తంగా 111 నగరాల్లో జరిగిన సర్వేలో కరీంనగర్‌కు 11వ ర్యాంకు రావడంలో కమిషనర్‌ పాత్ర ఎంతో ఉంది. ఈ అంశంపై పోటీ జరుగుతుందనే విషయం కూడా తెలియని నగరాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా పనులు చేస్తూ ప్రజల మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడంతోపాటు నివేదికను సిద్ధం చేసి సమర్పించడంలో విజయం సాధించారు. తెలంగాణలోనే మొదటి స్థానంలో కరీంనగర్‌ నిలువగా, ఇక్కడి నుంచి పోటీ పడ్డ హైదరాబాద్‌కు 23, వరంగల్‌కు 61వ ర్యాంకు రావడం గమనార్హం.

హరిత అవార్డు..
కరీంనగర్‌లో హరితహారంలో నాటిన మొక్కలను కాపాడడంలో సక్సెస్‌ సాధించారు. గతేడాది నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలను కాపాడి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో హరిత నగరం అవార్డు కరీంనగర్‌కు దక్కేలా కృషి చేశారు.

విద్యార్థులకు సమ్మర్‌క్యాంపులు..
కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల కోసం రెండు దఫాలుగా నిర్వహించిన సమ్మర్‌ క్యాంపుల్లో వేలాది మంది విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. వివిధ క్రీడాంశాల్లో నిర్వహించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017లో 1,300 మందికి, 2018లో 2,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో మెరుగైన పాత్ర పోషించారు. 

కలెక్టర్లుగా కమిషనర్లు..
కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు ముగ్గురు ఐఏఎస్‌లు పనిచేశారు. వీరంతా జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ చేసి తర్వాత కమిషనర్లుగా కరీంనగర్‌ వచ్చారు. మొదటి శ్రీకేష్‌లఠ్కర్‌ కమిషనర్‌గా రాగా.. ఆయన 2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణభాస్కర్‌ జిల్లాల విభజనతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం పనిచేసిన శశాంక జోగులాంభగద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. మొత్తం మీద ఇద్దరు ఐఏఎస్‌లకు కరీంనగర్‌ కలిసివచ్చిందనే చెప్పవచ్చు. జేసీలుగా పనిచేయకుండానే డైరెక్ట్‌ కలెక్టర్లు కావడం గమనార్హం.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top