కరీంనగర్‌ కీర్తి ‘పతాకం’

Karimnagar To Hoist Second Tallest National Flag - Sakshi

నేడు అతిపెద్ద జాతీయజెండా ఆవిష్కరణ రాష్ట్రంలో రెండో, దేశంలో మూడోది స్మార్ట్‌సిటీ పార్కు పనులకు అంకురార్పణ

సాక్షి, కరీంనగర్‌ : జాతీయ పతాక రెపరెపలు చూస్తుంటే ప్రతి భారతీయుడి మది పులకిస్తుంది. పంద్రాగస్టు, చబ్బీస్‌ జనవరి రోజు వాడవాడలా జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్‌ చేస్తే గర్వం గా ఉంటుంది. నిత్యం 150 ఫీట్ల ఎత్తులో జాతీయ జెండాలోని మువ్వన్నెలు కళ్లముందు రెపరెపలాడుతుంటే మేరా భారత్‌ మహాన్‌ అంటూ చె య్యేత్తి జైకొట్టాలనిపిస్తుంది. రాష్ట్రంలోనే రెండవ, దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ జెండా కరీంనగర్‌ నడిబొడ్డున ఆవిస్కృతమైతే సంతోషం కట్టలు తెంచుకుంటుంది. ఇంతటి మహాత్తర కార్యక్రమానికి మల్టీపర్పస్‌ స్కూల్‌ మైదానం వేదికైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండా రెపరెపలాడనుంది. 

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 ఫీట్ల మహా జాతీయజెండాను శుక్రవారం ఆవిష్కరించనున్నారు. స్మార్ట్‌సిటీగా అవతరించిన కరీంనగర్‌పై నగర ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నా రు. సుందరమైన రోడ్లు, ఇబ్బందిలేని మురుగునీటి వ్యవస్థ, ప్రజలకు సరిపడా తాగునీటి వ్యవస్థలాంటి మౌలిక సదుపాయాలతో పాటు నగరానికి ప్రత్యేకతగా నిలిచే కార్యక్రమాలపై బల్దియా దృష్టిపెట్టింది. ఈక్రమంలో కర్ణాటక, హైదరాబాద్‌ తర్వాత అత్యంత ఎత్తైన జాతీయజెండాను ఏర్పాటుచేసి కరీంనగర్‌కు ఐకాన్‌గా మార్చేందుకు మేయర్‌ రవీందర్‌సింగ్‌ జెండా ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిద్ధం చేశారు. 

‘స్మార్ట్‌’ పనులు ప్రారంభం..
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద చేపట్టనున్న మల్టీపర్పస్‌స్కూల్, సర్కస్‌గ్రౌండ్‌ మైదానాల్లో పార్కుల ఏర్పాటుకు అంకురార్పణ జరగనుంది. దేశంలోనే అత్యంత సుందరమైన పార్కుగా మల్టీపర్పస్‌ గ్రౌండ్‌ను తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రూ. 7.20 కోట్ల నిధులు కేటాయించారు. అదే విధంగా సర్కస్‌గ్రౌండ్‌లో పార్కు నిర్మాణానికి రూ.3.80 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు టెక్నికల్‌ కమిటీ ఆమోదం తెలుపడంతో శుక్రవారం పనులు ప్రారంభించనున్నారు. 

జెండావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి : మేయర్‌
ప్రజలు కొంతకాలంగా ఎదురుచూస్తున్న అతిపెద్ద జాతీయజెండా శుక్రవారం రెపరెపలాడనుందని నగర మేయర్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. జెండాను ఎంపీ వినోద్‌కుమార్‌ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీచైర్‌ పర్సన్‌ తుల ఉమ, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్‌ సర్ఫరాజ్‌అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, మున్సిపల్‌ కమిషనర్‌ స త్యనారాయణ హాజరవుతారని పేర్కొన్నారు. నగరంలోని అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, నగర ప్రజలు వేడుకలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top