
రేపు ఆగస్టు 15
నా దేశ పతాకం సమోన్నతంగా ఎగరాలి. కన్నెత్తి చూడాలన్నా శత్రువు వెన్నులో చలి పుట్టేట్టుగా, చెమట పట్టేట్టుగా మువ్వన్నెల నా దేశపతాకం ఆశేష భరతజాతి పరాక్రమ చిహ్నంగా రెపరెపలాడాలి. శార్దూల గాండ్రింపు, కరి ఘీంకారం, కాలు దువ్వే వృషభపు రంకె వంటి శౌర్య ప్రకటన చేస్తూ నా దేశ జెండా అలల కదలికల అంచులతో పెరపెరలాడుతూ ఎగరాలి. పసిబిడ్డ కడుపు నింపడానికి కర్షక క్షేత్రాలలో తుళ్లి పడేందుకు, గింజలకు మొలకలిచ్చేందుకు, పైరు నడుములను ధాన్యపు రాశుల బరువుతో వొంచేందుకు బిరబిరమని పరుగులెత్తి వచ్చే జీవనదుల నురగలా నా జాతి జెండా తళుకులీనుతూ ఎగురుతూ ఉండాలి.
కారడవుల్లో అడవి బిడ్డల అమలిన రేలపాట వోలె, ఎంగిలి అంట వీలులేని కొండతేనె తీపి వోలె, పేరు తెలియని పూల పరిమళాల వోలె, గుర్తు తెలియని రంగుపూల పెనుసౌందర్యం వోలె నా త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉండాలి. గిరిజనుల అమిత అతిథ్యం వంటి, మైదాన ప్రాంత జనుల చనువైన పలకరింత వంటి, జన సమూహాల అరమరికలు లేని జీవనం వంటి మూడు రంగుల అలాయి బలాయితో నా దేశ జెండా ఎగురుతూ ఉండాలి.
అతి శీతల హిమ పర్వతాల శిఖరాలపైన, ఎల్లలుగా ఉన్న అగాథపు సముద్రాల కెరటాలపైన, అంబరాలలో, ఆకాశాలలో, తుఫానులు రేగే ఎడారులలో, మానవ ప్రవేశానికి వీలు లేని అత్యంత కఠినమైన సరిహద్దు క్షేత్రాలలో నా జెండా అదరక బెదరక తడబడక వెనుదిరగక వందనం అర్పించే ఖణేల్మనే గొంతుల మధ్య, జైహింద్ పలికే సాయుధ దళాల ఎదుట స్ఫూర్తినిస్తూ, దీప్తి రగిలిస్తూ ఎగురుతూనే ఉండాలి.
గనులూ మణులూ అందరివీ అని, సంపదా సౌభాగ్యాలపై హక్కు అందరిదీ అని, భాషా యాసలు ఎవరివైనా సరే సమానమే అని, ఆచార వ్యవహారాలు రీతి రివాజులు ఉన్నది గౌరవించడానికే అని, తక్కువైనది ఏదీ లేదని, ఎక్కువ అనుకుంటూ ఏదీ ఎల్లెడలా మనజాలదని సందేశం ఇస్తూ నా జెండా ఎగురుతూ ఉండాలి. కండలు కరిగించే కూలీ, కంప్యూటర్ ఎదుట ఉద్యోగి, గవర్నమెంటు క్లర్కు, నిర్ణయాలు తీసుకునే అధికారి, ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన పాలకుడు... ఈ దేశాన ఉన్నది, గాలి పీలుస్తున్నది గట్టి మేల్ తలపెట్టడానికేనని, వొట్టి మాటలు కట్టి పెట్టాలని సందేశం ఇస్తూ ఈ దేశ జెండా ఎగురుతూ ఉండాలి. విద్యలో నిమగ్నమయ్యే విద్యార్థి, వికాసంలో సమ అవకాశాలు పొందే స్త్రీ, భద్రమైన బాల్యాన్ని పొందే బుజ్జాయి, ఆకలి కడుపు లేని ఇల్లు... ఇవే దేశ గౌరవానికి హేతువులు అని ఉపదేశం చేస్తూ నా దేశ జెండా ఎగురుతూ ఉండాలి.
మత్తు పదార్థాలకు చోటులేని, ద్వేషానికి తావు లేని, కుట్రలలో అనుక్షణం నిమగ్నం కాని, తోటి వారిపై అసూయా ద్వేషాలతో రగలని, అంతరాత్మ ఎదుట పతనమై నిలవని, నీతి నియమాలంటూ కొన్నయినా ఉన్నాయనే గ్రహింపు కలిగి, మనిషై పుట్టినందుకు మానవతను చాటుదామనే మనసు కలిగి, కులమతాల సంకుచితత్వం వీడి, సౌభ్రాతృత్వం శిరోధార్యమై, వైజ్ఞానిక ప్రగతి వైపు అడుగు కదిపే జాతిగా అవతరించమని ఆదేశిస్తూ, ఆరోహించమని హెచ్చరిస్తూ ఈ దేశపతాకం జాతికి ధ్రువతారౖయె ఎగురుతూ ఉండాలి. ఎగురుతూనే ఉండాలి.
– కె.