
సాహస పథం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది.
భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్‌ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్‌లోకి దూకింది.
‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్‌శర్మ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్‌లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు.
యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్‌ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్‌రాజ్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్‌గా సంచలనం సృష్టించింది.
300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్‌లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.