నాణేలతో రూపొందించిన భారీ జాతీయ జెండాతో హెడ్ కానిస్టేబుల్ సురేష్‌రెడ్డి
తిరుపతి హెడ్‌కానిస్టేబుల్ కళాపోషణ
గతంలోనూ వివిధ రకాల కళాకృతులకు రూపకల్పన
మనిషన్నాక కాసుంత కళాపోషణ ఉండాల అన్నట్టు ఈ హెడ్ కానిస్టేబుల్ వినూత్న ఆలోచనలతో నాణేలతో కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు.
తిరుపతి వెస్ట్ పోలీస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి తన భార్య సుమతి సహకారంతో 2001 నుంచి 1.60 లక్షల 25 పైసల (పావలా) నాణేలను సేకరించి 12 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో భారీ జాతీయ జెండాను (National Flag) రూపొందించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు కోసం తాను ఉండే పోలీస్ క్వార్టర్స్ మిద్దెపైన ఈ జెండాను ప్రదర్శించారు. పోలీసు అధికారులతోపాటు ఔత్సాహికులు ఈ నాణేల పతాకాన్ని వీక్షించి అబ్బురపడుతున్నారు.
సురేష్‌రెడ్డి గతంలో 25 పైసల నాణేలతో చార్మినార్, తంజావూరు బృహదీశ్వరాలయం, గేట్ వే ఆఫ్ ఇండియా, కేరళలోని ఆనంద నిలయం (Ananda Nilayam) వంటి పుణ్యక్షేత్రాలతోపాటు చారిత్రాత్మక ఘట్టాల ఆకృతులనూ రూపొందించారు. రిటైరయ్యేలోపు ఐదు లక్షల నాణేలతో భారీ జాతీయ పతాకాన్ని రూపొందించాలనే ఆలోచనతో ఉన్నట్టు సురేష్‌రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే సురేష్‌రెడ్డి తాతముత్తాతల నుంచి అందరూ పోలీసు శాఖలోనే పనిచేయడం మరో విశేషం.

చదవండి: తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు.. ఒకటి మాత్రమే అమ్ముతారు!


