కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వచ్చినప్పుల్లా యూపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతుండడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఐఫోన్‌ను ముందుగా దక్కించుకోవడానికి దుకాణాల ముందు యాపిల్ అభిమానులు గంటల తరబడి వేచివుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు పడిగాపులు కాస్తుంటారు. తాజాగా ఇలాంటి దృశ్యాలు ఇండియన్ సిలికాన్‌వ్యాలీలో దర్శనమిచ్చాయి. అదేంటి.. కొత్త ఐఫోన్ ఏదీ మార్కెట్‌లోకి రాలేదు కదా అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ క్యూ ఐఫోన్ల కోసం కాదు.. మరి దేనికోసం?
బెంగళూరులోని ఓ దుకాణం ముందు మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారంతా తెల్లవారుజామున 4 గంటల నుంచే షాపు ముందు వేచివున్నట్టు తెలుస్తోంది. చీరల కోసం వీరు ఇలా లైన్లో నిలబడ్డారని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే అవేమి ఉచితంగా ఇచ్చేవో, సగం ధరకు అమ్మేవో కాదు.. చాలా ఖరీదైన పట్టు చీరలు. ఏంటీ.. అంతేసి డబ్బులు పెట్టి కొనే కాస్ట్లీ సారీలను దక్కించుకునేందుకు ఇంత కష్టపడాలా అని జనం నోరెళ్లబెడుతున్నారు. విషయం పూర్తిగా తెలిస్తే మీరు కూడా క్యూ కడతారు!
మైసూరు పట్టు చీరలను దక్కించుకునేందుకు మహిళలంతా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) షోరూం ముందు మంగళవారం ఇలా క్యూ కట్టారు. లైన్లో వేచివున్న మహిళల కోసం ప్రత్యేకంగా స్టూల్స్ కూడా వేశారు. ఒక్క చీరనైనా దక్కించుకోవాలన్నట్టుగా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలున్న వీడియోను రాకేశ్ కృష్ణన్ సింహ అనే వ్యక్తి 'ఎక్స్'లో షేర్ చేశారు. రూ.23 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే మైసూరు పట్టుచీరల కోసం మహిళలు తెల్లవారుజాము నుంచే కేఎస్ఐసీ షోరూం ముందు వేచివున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికి టోకెన్లు కూడా ఇస్తున్నారని, టోకెన్ ఉన్నవారిని మాత్రమే దుకాణం లోపలికి అనుమతిస్తారని 'కన్నడప్రభ' తెలిపింది. అందరికీ చీరలు దక్కాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కరికి ఒకటి మాత్రమే విక్రయిస్తారని వెల్లడించింది.
కేఎస్ఐసీ (KSIC) మాత్రమే అసలు సిసలైన మైసూరు సిల్క్ సారీలను తయారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధీకృత తయారీ హక్కులు, జీఐ ట్యాగ్ రైట్స్.. ఇది కలిగివుంది. దీంతో కేఎస్ఐసీ శిక్షణ ఇచ్చిన వారు మాత్రమే మైసూరు పట్టు చీరలను నేస్తుండడంతో డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా చేయలేకపోతోంది. అందుకే తమ దుకాణానికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక చీర మాత్రమే విక్రయిస్తోంది. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా ఒరిజినల్ పట్టుచీరలను తయారు చేస్తోంది కాబట్టే మహిళలు కేఎస్ఐసీ దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఒరిజినల్ బ్రాండ్ వ్యాల్యూకు ఉండే క్రేజ్ అలాంటిది మరి!
Women queue up from 4.00 AM outside a Karnataka Soviet (sorry Silk) Industries Corporation showroom to buy silk sarees starting from ₹23,000 and going up to ₹250,000. Only 1 saree per customer and you need a token to be in the queue.
There is an ongoing shortage (or more… pic.twitter.com/d100w3hql0— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) January 20, 2026
నెటిజన్ల స్పందన..
''కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్ల ముందు మగాళ్లు 12 గంటలు ముందుగానే క్యూ కట్టడం మామూలు విషయం. కానీ చీరల కోసం మహిళలు క్యూలో వేచివుండడం ఆసక్తికరం.''
''కొత్త ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆపిల్ షోరూమ్‌ల వెలుపల కూడా ఇలాంటి దృశ్యాలే కన్పిస్తుంటాయి. అంటే ఆ ఫోన్‌ల కొరత ఉందని కాదు. ఐఫోన్ కోరుకునే ప్రతి ఒక్కరూ చివరకు దాన్ని దక్కించుకుంటారు. చీర కోసం 23 వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటే.. వారంతా బాగా డబ్బున్న ఉన్నవారే అయుంటారు.''
''ప్రైవేటు దుకాణాల కంటే కేఎస్ఐసీ నాణ్యతపై నమ్మకంతోనే మహిళలు ఇక్కడ పట్టు చీరలు కొనేందుకు వస్తున్నారు.''
చదవండి: కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా?


