
మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ వినోద్‌కుమార్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని నాలుగు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నెల 26న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
జస్టిస్ ఏకే సింగ్ బదిలీకి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఆయన తెలంగాణ హైకోర్టు ఏడో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. 1965, జూలై 7న జస్టిస్ ఏకే సింగ్ జన్మించారు. బీఏ ఆనర్స్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 వరకు అక్కడ న్యాయవాదిగా పనిచేసి.. 2001లో జార్ఖండ్ హైకోర్టుకు మారారు.
2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2023, ఏప్రిల్ 17న ప్రధాన న్యాయమూర్తి పదోన్నతితో త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ అయిననప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ సుజోయ్‌పాల్‌ను కూడా కలకత్తాకు బదిలీ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కాగా, రాజస్తాన్ సీజేగా ఉన్న జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవను మద్రాస్ హైకోర్టుకు, జార్ఖండ్ సీజేగా ఉన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును త్రిపుర హైకోర్టుకు, మద్రాస్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ కేఆర్ శ్రీరామ్‌ను రాజస్తాన్ హైకోర్టుకు బదిలీ చేశారు.
తెలంగాణ నుంచి మరో జడ్జి బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు నుంచి మరో న్యాయమూర్తి బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది.