దూర ’దృష్టి’ లోపం

Kanti Velugu Programme In Rangareddy - Sakshi

‘కంటివెలుగు’ కార్యక్రమం చీకటి తెరలను తొలగించడం లేదు. అందరికీ చక్కటి చూపు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం.. దగ్గరి చూపు కళ్ల జోళ్లు అందజేతకే 
పరిమితమైంది. దూర దృష్టి లోపమున్న వారికి కళ్ల అద్దాల పంపిణీ అటకెక్కింది. కంటి పరీక్షలు చేయించుకుని 50 రోజులు దాటినా అద్దాల ఊసే లేదు. కనీసం ఎప్పుడు వస్తాయన్న విషయంపైన స్పష్టత లేదు. దీంతో పరీక్షలు చేయించుకొని దూరపుచూపు అద్దాలు అవసరమున్న 50 వేల మంది నిరీక్షిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఇంకా శస్త్రచికిత్సలు ప్రారంభం కాలేదు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా జనాభా 24.46 లక్షలు. ఇందులో 35 నుంచి 40 శాతం మంది వరకు కంటి సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అంచనా. వీరందిరికీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైతే కళ్ల జోళ్లు, మందులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే దృష్టిలోపం తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్సలు నిర్వహించి చక్కటి చూపు ప్రసాదించాలి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 55 మెడికల్‌ టీంలు ప్రతి గ్రామంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల నేత్రాలను స్క్రీనింగ్‌ చేస్తున్నారు.

ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3 లక్షల మందిని స్క్రీనింగ్‌ చేయగా.. ఇందులో సుమారు 73 వేల మందికి దగ్గరి చూపు లోపమున్నట్లు గుర్తించి వారికి కళ్ల అద్దాలు అందజేశారు. దూరపు చూపు లోపమున్నట్లు 65 వేల మందికి పైగా గుర్తించారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లోగా అద్దాలు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా కనీసం ఒక్కరికి కూడా అద్దాలు అందించిన దాఖలాలు లేవు. 

శస్త్ర చికిత్సలకు సెలవు! 
కంటిశుక్లం, మోతియ బిందువు, నల్లపాప మీద పొర, మెల్లకన్ను తదితర లోపాలున్న వారిని పైఆస్పత్రులకు రిఫర్‌ చేసి అక్కడ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 25 వరకు నోడల్‌ ఆస్పత్రులను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఒకటిరెండు మినహా అన్ని ప్రైవేటు ఆస్పత్రులే. శస్త్రచికిత్సలు అవసరమని ఇప్పటి వరకు 33 వేల మందికి పైగా గుర్తించారు. వీరందరినీ ఆయా ఆస్పత్రులకు తీసుకెళ్లి శస్త్రచికిత్సలు చేయించాల్సిన బాధ్యత అధికారులది.

అయితే, ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో నోడల్‌ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు మొదలు కాలేదు. ఉత్సాహంగా క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్న జనం.. శస్త్రచికిత్సలు కోసం వేయికళ్లలో నిరీక్షిస్తున్నారు. అయితే, ఇప్పట్లో శస్త్రచికిత్సలు ఉండవన్న సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫివ్రబరిలో చేయొచ్చని అధికారులు నర్మగర్భంగా చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా పేరుకే కంటి వెలుగు కార్యక్రమం ఉన్నా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోందని బాధితులు మథనపడుతున్న సంఘటనలు ప్రతి పల్లెలో కనిపిస్తున్నాయి.

అద్దాలు ఇంకా రాలేదు 
ప్రస్తుతం దగ్గరి చూపు లోపమున్న వారికి కళ్ల అద్దాలు అందజేస్తున్నాం. దూరపు చూపులోపమున్న వారు అద్దాల కోసం కొన్ని రోజులు ఆగాలి. ప్రభుత్వం నుంచి జిల్లాకు ఇంకా రాలేదు. రాగానే వీలైనంత త్వరలో అందజేస్తాం. అలాగే శస్త్రచికిత్సల కోసం 30 వేలకుపైగా మందిని రిఫర్‌ చేశాం. ప్రస్తుతానికి శస్త్రచికిత్సలు ఇంకా మొదలు కాలేదు. – డాక్టర్‌ గణేష్,  ‘కంటివెలుగు’ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top