
హైదరాబాద్: వైశ్య కులంలో పుట్టిన మోదీ బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారని టీమాస్ ఫోరం చైర్మన్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. ఈ క్రమంలో దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందని.. దీనికి గానూ కమ్యూనిస్టులు నిర్మాణాత్మకమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల రంగంలో దిగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో మార్క్సిజం–అంబేడ్కర్ ఆలోచనా విధానం–సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై సదస్సు జరిగింది.
ఐలయ్య మాట్లాడుతూ కింది కులాల వారిని ఐక్యం చేసి రాజ్యధికారం వైపు పయనించేలా చేయాలని సూచించారు. బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మద్దికాయల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, తాండ్ర కుమార్, జయరాజు, నల్లా సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.