
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. భువనగిరి జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లోని 23 వేల ఎకరాలకు నీరిచ్చేలా నీటి పారుదల శాఖ రంగం సిద్ధం చేసింది. కాళేశ్వరంలోని బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి 1.8 టీఎంసీల నీటిని హై లెవల్ కెనాల్ ద్వారా అందించేలా కార్యాచరణ రూపొందించారు. కాళేశ్వరం పథకం రీడిజైన్‌లో భాగంగా 0.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్‌ను 11.39 టీఎంసీలకు పెంచారు. దీనికింద 1.65 లక్షల ఎకరాల ఆయకట్టును తొలుత ప్రతిపాదించారు. ఇందులో గ్రావిటీ కెనాల్ కింద 53,500 ఎకరాల ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్ దిగువ కెనాల్ ద్వారా 1.12 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
రిజర్వాయర్ దిగువన ఆయకట్టుకు నీరిచ్చేందుకు సిల్ లెవల్‌ను 440 మీటర్లుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాజెక్టుల ద్వారా నీరందని, నీటి వసతిలేని భువనగిరి జిల్లాలోని ఆయకట్టుకు నీరివ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై అధ్యయనం చేసిన అధికారులు, రిజర్వాయర్‌లో సిల్ లెవల్ 475 మీటర్ల నుంచి హైలెవల్ కెనాల్ ద్వారా భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లోని 23 వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. దీని కోసం 10.5 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, మరో 100 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం రూ.80 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. కాల్వలకు 106 ఎకరాల భూమి అవసరం పడుతుందని, త్వరలోనే భూ సేకరణ పూర్తి చేసి కాల్వల తవ్వకం పనులు మొదలు పెట్టనున్నారు.