722 గంటలు.. 5.65 టీఎంసీలు! 

Kaleshwaram Project Pumps 5.65 TMC In 722 Hours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. ప్రాజెక్టుల్లోకి ఎక్కడా నీటి ప్రవాహాలు కానరాని నేపథ్యంలో ప్రాణహిత ద్వారా వస్తున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపుపై ప్రభుత్వం పూర్తి శ్రద్ధ పెట్టింది.  మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన వరదను వచ్చినట్లుగా ఒడిసిపడుతున్న నీటిపారుదల శాఖ కన్నెపల్లి పంప్‌హౌజ్‌ ద్వారా ఎత్తిపోతలు చేపడుతోంది. ఇంతవరకు 722 గంటల పాటు కన్నెపల్లిలోని 5 మోటార్లను నడపగా, 5.65 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజీలో మరో 7 టీఎంసీల మేర నీటిని నిల్వ చేశారు. ప్రాణహిత నదీ పరివాహకంలో ఆశిం చిన స్థాయి వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి పెరిగే అవకాశాల నేపథ్యంలో దిగువ అన్నారం పంపులకు  వెట్‌రన్‌ మొదలుపెట్టగా, సుందిళ్ల పంపులను అధికారులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. 

ఇప్పటివరకు ఓకే.. ఇకపైనే భారీ ఆశలు 
ప్రాణహిత నదికి ఇంతవరకు ఆశించిన స్థాయిలో ప్రవాహాలు రాలేదు. గతేడాది ఇదే సమయానికి 2.50 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు నమోదు కాగా ఈ ఏడాది గరిష్టంగా 20 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరదను మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసి, అక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌజ్‌ ద్వారా ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు 5.65 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.  ఆదివారం నుంచి ప్రాణహిత ద్వారా 9,700 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో తిరిగి రెండు పంపులను ఆరంభించి నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 7 టీఎంసీల మేర 96.5 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా అడ్డుకట్ట వేస్తున్నారు.

అయితే ఈ వరద మరో 4 రోజుల్లో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఉధృతి మొదలైతే కన్నెపల్లిలో 6 పంపులను ఆరంభించి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు అంతా సిద్ధం చేశారు. ఇక వరద ఉధృతి పెరిగి రోజుకు టీఎంసీ నీటి ఎత్తిపోతల మొదలు పెట్టే నాటికి అన్నారంలో 4 పంపులు, సుందిళ్లలో 5 పంపులను పరీక్షించి సిద్ధం చేసేలా ఇంజనీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నారంలో ఒక పంపు వెట్‌రన్‌ పూర్తి కాగా, ఆదివారం 3 వేల క్యూసెక్కుల సామ ర్థ్యం ఉన్న మరో పంపునకు వెట్‌రన్‌ నిర్వహించారు. అన్నారం నుంచి నీరు సుందిళ్ల బ్యారేజీకి చేరుతోంది. 

ఆగస్టు 15 నాటికి మిడ్‌మానేరుకు.. 
సుందిళ్ల నిల్వ సామర్థ్యం 8.87 టీఎంసీ కాగా ఇందులోనూ 4.5 టీఎంసీల మేర నిల్వలు చేరితే ఇక్కడి నుంచి నీటి ఎత్తిపోతలు మొదలు కానుంది. వచ్చే నెల తొలి వారం నుంచి ఇక్కడ ఎత్తిపోతలు ఆరంభిం చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎల్లంపల్లిలో ప్రస్తుతం లభ్యతగా ఉన్న 5.60 టీఎంసీల నీటిని ప్యాకేజీ–6లో సిద్ధంగా ఉన్న 5 మోటార్ల ద్వారా ప్యాకేజీ–7 టన్నెల్‌ ద్వారా ప్యాకేజీ–8 పంప్‌హౌజ్‌కి, అటునుంచి సిద్ధంగా ఉంచిన 5 మోటార్ల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. వచ్చే నెల ఆగస్టు 15 నాటికి గోదావరి నీళ్లు మిడ్‌మానేరుకు చేర్చాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top