కేరళకు అందరూ అండగా నిలవాలి

Justice tb Radhakrishnan starts kerala flood donations - Sakshi

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌

హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం రవీంద్రభారతిలో కాన్ఫె డరేషన్‌ ఆఫ్‌ తెలుగు రీజియన్‌ మలయాళీ అసోసియేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలతో కలసి కేరళ వరద సహాయనిధి సేకరణను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు చీఫ్‌జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ కష్ట కాలంలో ఉన్న కేరళ  రాష్ట్రానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. దేశం మొత్తం కేరళ రాష్ట్రానికి అండగా నిలుస్తోందనీ, సకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా మాట్లాడారు.

ముందుకు వచ్చిన దాతలు..
రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించిన కేరళ వరద సహాయనిధి సేకరణకు విశేష స్పందన లభించింది. కేరళ వరదల బాధితులకు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు సైతం తమకు తోచినంత సాయం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ రోటరీ క్లబ్‌ రూ.4 లక్షలు, ఇంక్రడబుల్‌ ఇండియా రూ.2 లక్షలు, విజయాబ్యాంక్‌ రూ.2 లక్షలు, ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్, జిల్లా జడ్జి రాధారాణిలు తమ నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్‌ సతీమణి మీరా రాధాకృష్ణన్, రవాణాశాఖ అధికారి సీఎల్‌ఎన్‌ గాంధీ, అసోసియేషన్‌ అధ్యక్షుడు బెంజ్‌మెన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
ఓసీ సంక్షేమ సంఘం మలయాళీ విభాగం ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల చెక్కు, మూడు లక్షల  రూపాయల విలువగల సామగ్రిని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి, మలయాళీ విభాగం అధ్యక్షుడు కె.సూర్యకుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో వీటిని సేకరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top