అడవిలోని అనుభూతి కలిగించే జంగల్‌ క్యాంపు

Jungle Camp At Maheshwaram Makes The Jungle Feel - Sakshi

నగరవాసులకు ఎంతో ఉపయోగం

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మహేశ్వరం మండలం హర్షగూడలో జంగల్‌ క్యాంపు ప్రారంభం

మహేశ్వరం: నగరవాసులకు మానసికోల్లాసంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం జంగల్‌ క్యాంపులో లభిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం మండలం హర్షగూడ దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో మజీద్‌గడ్డ రిజర్వు ఫారెస్టులో 450 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.34 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ‘జంగల్‌ క్యాంపు’ను ఇంద్రకరణ్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగల్‌ పార్కులో వినోదంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. ఇక్కడ అడ్వెంచర్‌ క్యాంపు థీమ్‌తో సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. నగరవాసులు కుటుంబంతో వచ్చి రోజంతా గడిపేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. జంగల్‌ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.    

జంగల్‌ క్యాంపు ప్రత్యేకతలు 

ఫైర్‌ (చలికి కాచుకునే ప్రదేశం) క్యాంపును పరిశీలిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, అధికారులు

నగర ఉద్యాన యోజన, కంపా, అటవీశాఖ నిధులతో జంగల్‌ క్యాంపును అభివృద్ధి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా అడ్వెంచర్‌ జోన్, జంగల్‌ క్యాంపు సెక్టార్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాకింగ్, రన్నింగ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌లతో పాటు క్యాంపింగ్‌ సౌకర్యాలు, సాహస క్రీడలు, చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆటస్థలం, గజీబోలు, మల్టీపర్పస్‌ షెడ్స్, కుటుంబంతో గడిపేందుకు పిక్‌నిక్‌ స్పాట్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పార్కులో వంట చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలాలు ఉన్నాయన్నారు. సందర్శకుల రక్షణ చర్యలో భాగంగా క్యాంపింగ్‌ ఏరియా చుట్టూ చైన్‌లింక్డ్‌ ఫెన్సింగ్, పాములు చొరబడకుండా ప్రూఫ్‌ ట్రెంచ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పార్కులో ఉన్న రోడ్లకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అటవీవీరుల పేర్లను పెట్టి వారి త్యాగాలకు స్మరించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు.   

నగరవాసులకు వరం  
హైదరాబాద్‌ శివారులో మంచి వాతావరణం కల్పించేందుకు జంగల్‌ క్యాంపు పార్కును ఏర్పాటు చేశామని, ఈ పార్కు నగరవాసులకు వరంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇతర నగరాల మాదిరిగా హైదరాబాద్‌ కాంక్రీట్‌ జంగల్‌గా మారొద్దనే ఉద్దేశంతో అర్బన్‌ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో జంగల్‌ క్యాంపును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రులు జంగల్‌ క్యాంపును ప్రారంభించి, అడ్వెంచర్‌ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సాహస క్రీడలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, కలెక్టర్‌ హరీష్,  ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి శోభ, జిల్లా అటవీశాఖ అధికారి భీమ, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డివిజనల్‌ ఫారెస్టు అధికారి శివయ్య, మంఖాల్‌ ఫారెస్టు రేంజ్‌ అధికారి విక్రంచంద్ర తదితరులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top