ఆర్టీసీ సమ్మెపై స్పందించిన పవన్‌ కల్యాన్‌

Janasena President Pawan Kalyan Responds On TS RTC Strike - Sakshi

ఉద్యోగుల తొలగింపు ఆందోళనకరం: పవన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని, ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదారత చూపాలని పవన్‌ కోరారు. ‘తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు తెలంగాణ పరిధిలో వున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసి ఉంది. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశాం. ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా వుంది.’ అని  సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top