
హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలి: జానా
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని సీఎ ల్‌పీ నాయకుడు కె.జానారెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని సీఎ ల్‌పీ నాయకుడు కె.జానారెడ్డి డిమాండ్ చేశా రు. రైతుల రుణమాఫీ అమలుకు నెల రోజు ల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం సీఎల్‌పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు కాలపరిమితి విధించి, చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లోగా ఎన్ని చేయగలుగుతారో పేర్కొని, మిగిలినవాటిని శీతాకాల సమావేశాల్లోగా పూర్తిచేయాలని, ఈ మేరకు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు.
కొత్తరుణాలు అందక ఒకవైపు, విద్యుత్ కోతలతో మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పక్కరాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసైనా వ్యవసాయానికి ఏడుగంటల కరెంట్ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి కేంద్రం ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు.